కుప్పంలో టీడీపీపై వైసీపీ దాడులు.. ఇద్దరికి గాయాలు.. డీజీపీకి చంద్రబాబు ఫిర్యాదు..
Published on: Tue Jan 11, 2022 10:37AM
ప్రశాంత కుప్పంను.. అశాంత కుప్పంగా మారుస్తోంది అధికార వైసీపీ. కొంతకాలంగా కావలనే కుప్పంలో ఏదో ఒక గొడవ సృష్టిస్తోంది. పదే పదే టీడీపీ శ్రేణులను టార్గెట్ చేస్తున్నారు. దాడులకూ తెగబడుతున్నారు. పోలీసులు సైతం వైసీపీ వారికే వంత పాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా, అర్థరాత్రి కుప్పంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరగడం కలకలంగా మారింది. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో టీడీపీ వర్గాలకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు పోస్టులు చేశారు. ఇదేంటని టీడీపీ వారు ప్రశ్నించడంతో.. వివాదం మొదలైంది. వైసీపీ వర్గీయులు రెచ్చిపోయి.. టీడీపీ వారిపై దాడులు చేశారు. ఇటునుంచి ప్రతిదాడి జరిగింది. అది ముదిరి టీడీపీ, వైసీపీ కేడర్ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది.
వైసీపీ దాడిలో టీడీపీ కార్యకర్త లోకేష్ గాయపడ్డారు. వైసీపీకి చెందిన మహేశ్‌కు దెబ్బలు తగిలాయి. ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు పర్యటన భారీగా సక్సెస్ కావడంతో.. ఆ కళ్ల మంటతోనే వైసీపీ వారు ఇలా రెచ్చగొట్టి దాడులకు దిగారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.
మరోవైపు, కుప్పంలో టీడీపీ నేతలపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. దాడికి గురైన వారిని ఆసుపత్రిలో చేర్చుతుంటే కూడా అడ్డుపడ్డారని ఆరోపించారు. స్థానికంగా ఉన్న అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించడం వల్లనే దాడి చేశారని.. శాంతి భద్రతలు కాపాడే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.



