జనసేనాని మాటలకు అర్థాలే వేరులే!
Published on: Tue Mar 15, 2022 5:44PM
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అంకానికి తెరతీసింది. ఇప్పటి దాకా చిక్కుముడిగా ఉన్న పొత్తుల విషయం మీద ఆయన చెప్పిన భాష్యం ఆ ముడిని విప్పదీసినట్టే భావించవచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తా అని ఆయన బహిరంగంగా ప్రకటించి సంచలనం సృష్టించారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో అధికార పార్టీని ఓడించే బాధ్యతను తన భుజస్కందాల మీద వేసుకుంటున్న భావన పవన్ కలిగించాడు. ప్రభుత్వ ఓటు చీలకుండా ఉండాలంటే, పవన్ ఏం చేయాలనే దాని మీద అప్పుడే చర్చోపచర్చలు ఊపందుకున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో అదికార పక్షాన్ని మినహాయిస్తే, తెలుగుదేశం, బిజెపి, జనసేన, సిపిఎం, సిపిఐ పార్టీలు ఉన్నాయి. సరే, కాంగ్రెస్ ఉన్నా లేనట్టే అన్న చందంగా నడుస్తోంది. ఒక రకంగా చూస్తే, పవన్ కళ్యాణ్ బిజెపికి, తెలుగుదేశానికీ సమాంతర దూరంలో ఉన్నట్టు లెక్క. విషయమేమిటంటే, ఆయన బిజెపితో అధికార స్నేహంలో ఉన్నాడు, తెలుగుదేశంతో ప్రాక్టికల్ స్నేహంలో ఉన్నాడు. ఈ క్రమంలో వీళ్ళిద్దరినీ ఒక తాటి మీదకి తెచ్చే బాధ్యతను సునాయాసంగా నెరవేర్చడం తనకు తేలికైన పని అని పవన్ భావిస్తున్నట్టుగా ఆయన మాటలను బట్టి అనిపిస్తోంది.
అటు బిజెపితోనూ, ఇటు తెదేపాతో కూడా ఒకేరకమైన సుముఖతతో నడవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటనను బట్టి అనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఒంటరిపోరాటం ద్వారా చెయ్యి కాల్చుకుని తానెంతో నష్టపోయాడో తెలుసుకున్న పవన్, తెలుగుదేశంతో కలిసి నడవడానికి సిద్ధమైనట్టు ఆయన మాటలు చెప్తున్నాయి.
ఎటొచ్చీ, తెలుగుదేశంతో కలిసి నడవడానికి బిజెపి సంసిద్ధంగా ఉంటుందా లేదా అన్నదే ప్రధాన ప్రశ్న. బిజెపిని ఒప్పించి, మెప్పించి, నమ్మించడంలో పవన్ కళ్యాణ్ ఏమేరకు విజయవంతం అవుతాడన్నది వేచి చూడాల్సిన విషయమే. ఆవిర్భావ సభ సందర్భంగా పవన్ చేసిన ప్రకటనల పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు స్పందించిన తీరు చూస్తుంటే, కమలనాథులకు తమకంటూ ఒక ప్రత్యేక దారి ఉన్నదన్న భావన వ్యక్తం చేసినట్టుగా ఉంది. సోము వీర్రాజు అందీఅందకుండా స్పందించిన తీరు మాత్రం కేంద్ర నాయకత్వం మీదే అంతా ఆధారపడి ఉందని చెప్పకనే చెప్పినట్టుంది. ఈ నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ - బిజెపి కేంద్ర నాయకుల మధ్య తీవ్రస్థాయిలో దీని మీద చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజెపి కేంద్ర నాయకత్వం పవన్ ను ఒప్పించగలిగితే తెలుగుదేశంతో పొత్తు ఉండకపోవచ్చు. అలా కాకుండా, పవనే కేంద్ర నాయకత్వాన్ని ఒప్పిస్తే తెలుగుదేశంతో కలిసి నడిచే అవకాశాలు ఉంటాయి.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు కనుక తెలుగుదేశం గుర్రం ఎగిరినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే, దక్షిణాదిలో బిజెపి తన అస్తిత్వాన్ని నిరూపించుకునేందుకు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో ఈ పొత్తుల విషయం సందేహాస్పదమే అనే వారూ లేకపోలేదు. ఏది ఏమైనా, 2024 ఎన్నికల్లో విజయావకాశాలను పక్కన పెడితే, ముందుగా ఈ పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ జయాపజయాలే ప్రస్తుతం చాలా కీలకమైనవిలా కనిపిస్తున్నాయి.


