TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీకి ప్ర‌త్యేక హోదా.. ఉద‌యం YES.. సాయంత్రం NO.. ఏదో జ‌రుగుతోంది?

Published on: Sat Feb 12, 2022 7:11PM

ఏపీ విష‌యంలో కేంద్ర స్థాయిలో మ‌ళ్లీ ఏదో రాజ‌కీయం జ‌రుగుతున్న‌ట్టుంది? ఉన్నట్టుండి కేంద్రహోంశాఖ నుంచి ప్రత్యేక హోదా ప్రస్తావన వ‌చ్చింది. హమ్మయ్యా అనుకున్నారు ఆంధ్రులంతా. కానీ, సాయంత్రానికల్లా సీన్ మారిపోయింది. తూచ్..తూచ్.. స్పెషల్ స్టేటస్ టాపిక్ లేదంటూ సవరించుకున్నారు. అదేంటి.. మార్నింగ్ సర్క్యులర్‌లో ఉందిగా అంటే.. అది పొర‌బాటున జ‌రిగిందంటూ జీవీఎల్ వెంట‌నే తెర‌మీద‌కు వ‌చ్చారు. సాయంత్రానికి మ‌రోసారి స‌వ‌రించిన ఉత్త‌ర్వు వ‌చ్చింది. ఇంత‌కీ ప్ర‌త్యేక హోదా ప్ర‌స్తావ‌న స‌డెన్‌గా ఎందుకు తీసుకొచ్చారు? ఎవ‌రు అడిగారు? ఎవ‌రు తీసేయ‌మ‌న్నారు? అంతా తేడా తేడాగా ఉందంటున్నారు. ప్ర‌త్యేక హోదాతో మోదీ అండ్ కో మ‌ళ్లీ ఏదో జ‌గ‌న్నాట‌కానికి తెర తీశార‌ని అనుమానిస్తున్నారు. ఇంత‌కీ ప్ర‌త్యేక హోదాపై అస‌లేం జ‌రిగిందంటే...

గురువారం ప్ర‌ధాని మోదీ.. రాజ్య‌స‌భ‌లో రాష్ట్ర విభ‌జ‌న‌పై తీరుపై కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విభ‌జ‌న జ‌రిగిన తీరు స‌రిగా లేద‌ని, ఏపీ, తెలంగాణ‌లు న‌ష్ట‌పోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. క‌ట్ చేస్తే.. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న వివాదాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ ఎవ‌రూ అడ‌గ‌క‌ముందే ముందుకొచ్చింది. ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీలో కేంద్రం తరపున హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్ నేతృత్వం వహిస్తార‌ని.. తెలంగాణ నుంచి రాష్ట్ర ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామకృష్ణారావు.. ఏపీ నుంచి ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి ఎస్.ఎస్.రావత్ సమావేశంలో హాజ‌ర‌వుతార‌ని తెలిపింది. ప్రతినెల త్రిసభ్య కమిటీ సమావేశం అవుతుందని.. ఈనెల 17న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తొలి సమావేశం జరుగుతుంద‌ని వెల్ల‌డించింది. ఆ స‌మావేశం ఎజెండా అంటూ 9 అంశాల‌ను ప్ర‌క‌టించింది. అందులో 7వ అంశంగా ప్ర‌త్యేక హోదా ఉండ‌టం సంచ‌ల‌నంగా మారింది. 

అవునా, స్పెష‌ల్ స్టేట‌స్‌పై క‌మిటీ చ‌ర్చించ‌బోతుందా? అని తెలుగువారంతా ఆస‌క్తిగా చ‌ర్చించుకోవ‌డం మొద‌లుపెట్టారు. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్‌లు న‌డిచాయి. ఏపీలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ రంగంలోకి దిగారు. కేంద్ర హోంశాఖ అధికారుల‌తో ఏం మాట్లాడారో ఏమో గానీ.. మీటింగ్ ఎజెండా నుంచి ప్ర‌త్యేక హోదా అంశం ఎగిరిపోయింది. 9 అంశాలు కాస్తా.. 5కు త‌గ్గాయి. స‌వ‌ర‌ణ‌ల‌తో కేంద్ర హోంశాఖ నుంచి మ‌రో ఉత్త‌ర్వు వ‌చ్చింది. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీ ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు లేదని తెలిపింది. వెనుకబడిన జిల్లాకు నిధులు, పన్ను రాయితీలను కేంద్రం తొలగించింది.

నిజానికి, కేంద్ర ప్రభుత్వమే కాదు.. ఏపీ ప్రభుత్వం కూడా గడచిన రెండున్నర ఏళ్ల‌లో ప్రత్యేక  హోదా విషయాన్ని ఏ సందర్భంలోనూ ప్రస్తావించలేదు. తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కానీ, రాష్ట్రపతి ప్రసంగలో కానీ ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. ఇక‌, ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు ప్ర‌త్యేక హోదాపై ఊద‌ర‌గొట్టిన జ‌గ‌న‌న్న.. సీఎం అయ్యాక ఆయ‌న‌ నోటి నుంచి స్పెష‌ల్ స్టేట‌స్ డిమాండ్ వ‌చ్చిందే లేదు.. కేంద్రాన్ని గ‌ట్టిగా నిల‌దీసిందే లేదు. 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జగన్ రెడ్డి హోదా విషయంలో ఢిల్లీలోనే చేతులు ఎత్తేశారు. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చినందున‌, కేంద్రాన్ని ప్రాధేయపడడం మినహా చేయగలిగింది ఏమీ లేదని హ్యాండ్స‌ప్ అనేశారు. టీడీపీ మాత్రం ప్రత్యేక హోదాపై పలుమార్లు పార్లమెంట్ లోపలా, వెలుపలా బ‌ల‌మైన వాయిస్ వినిపిస్తూనే ఉంది. అలాంటిది, కేంద్ర ప్ర‌భుత్వం స‌డెన్‌గా రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై క‌మిటీ ఏర్పాటు చేయ‌డం.. అందులో ప్ర‌త్యేక హోదా అంశం పొందుప‌ర్చ‌డంతో ఒక్క‌సారిగా అంతా ఉలిక్కిప‌డ్డారు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే.. తూచ్ అంటూ ఎజెండా నుంచి స్పెష‌ల్ స్టేట‌స్ టాపిక్ డిలీట్ చేశారు. 2024 ఎల‌క్ష‌న్ టార్గెట్‌గా చేసుకుని.. బీజేపీ ఏపీతో ప్ర‌త్యేక హోదాతో గేమ్ ఆడుతోందా అనే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే యూపీలో బీజేపీ ప్రాభ‌వం బాగా ప‌త‌నం కావ‌డంతో.. అక్క‌డ త‌గ్గిన సీట్ల‌ను ఏపీలో క‌వ‌ర్ చేసుకునేందుకే స‌రికొత్త డ్రామా స్టార్ట్ చేసింద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఏపీలో ప్ర‌త్యేక చిచ్చు ర‌గిల్చి.. వైసీపీతో జ‌త‌క‌ట్టి.. క్లైమాక్స్‌లో హోదా ఇచ్చేసి.. రాష్ట్రంలో పాగా వేయాల‌నే స్కెచ్ ఏదో ర‌చించార‌ని అంటున్నారు.