TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీకి జ‌గ‌న్‌.. ఢిల్లీలోనే కేసీఆర్‌.. మోదీ టైమ్స్‌! ఏం జ‌రుగుతోంది?

Published on: Mon Apr 4, 2022 2:41PM

ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీ వెళ్తున్నారు. మంగ‌ళ‌వారం సాయంత్రం ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌నున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు, నిధులు, అప్పులు, కొత్త జిల్లాలు ఇలా ప‌లు అంశాల‌పై పీఎంతో చ‌ర్చించ‌నున్నారు. ఎప్ప‌టిలానే ప్ర‌త్యేక హోదా అంశం ఈసారి కూడా షెడ్యూల్‌లో లేదని తెలుస్తోంది. అయితే, జ‌గ‌న్ ఢిల్లీ వెళ్ల‌డం, అదే స‌మ‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం హ‌స్తిన‌లో ఉండ‌టం.. రాజ‌కీయ వ్యూహాగానాల‌కు తెర తీస్తోంది. 

పైపైన చూస్తే రాజ‌కీయ జ‌గ‌న్నాట‌కం అంత ఈజీగా అర్థం కావు. విశ్లేష‌కులు మాత్ర‌మే కాస్త ముంద‌స్తుగా ఊహించ‌గ‌ల‌రు. ఆదివారం సాయంత్రం స‌డెన్‌గా సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. మూడు రోజుల పాటు అక్క‌డే ఉండ‌నున్నారు. ప్ర‌ధాని మోదీని క‌లిసేందుకు అపాయింట్‌మెంట్ ట్రై చేస్తున్నారు. కానీ, పీఎంవో నుంచి ఇంకా ఎలాంటి గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు. కేసీఆర్‌ హ‌స్తిన‌లో పీఎంతో భేటీ కోసం వెయిట్ చేస్తున్నారు. 

క‌ట్ చేస్తే.. సీఎం జ‌గ‌న్ మంగ‌ళ‌వారం ఢిల్లీ వెళ్తున్నారంటూ సోమ‌వారం స‌డెన్‌గా న్యూస్ వ‌చ్చింది. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకున్నా.. ఆక‌స్మికంగా జ‌గ‌న్ ఢిల్లీ వెళ్తుండ‌టం ఆస‌క్తి క‌లిగిస్తోంది. కేసీఆర్ ప‌డిగాపులు ప‌డుతున్నా మోదీ అపాయింట్‌మెంట్ మాత్రం దొర‌క‌ట్లే. అదే, జ‌గ‌న్ ఇలా అడ‌గ్గానే అలా స‌మ‌యం ఇచ్చేశారు ప్ర‌ధాని. మోదీ-జ‌గ‌న్‌, బీజేపీ-వైసీపీ అంట‌కాగుతోంద‌నేందుకు ఇది మ‌రో ఎగ్జాంపుల్ అంటున్నారు. ఇప్ప‌టికే పీఎం మోదీ.. సీఎం జ‌గ‌న్‌ను కొడుకులా ఆద‌రిస్తున్నారంటూ ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌హిరంగంగానే చెప్పేశారు. ఇప్పుడు కేసీఆర్‌ను కాద‌ని.. జ‌గ‌న్‌ త‌న‌వాడే అనే మెసేజ్ ఇచ్చేలా అపాయింట్‌మెంట్ ఇచ్చేశారు మోదీ. దీంతో దొందు దొందేన‌ని మ‌రోసారి తేలిపోయింది. 

అటు, తెలంగాణ‌లోనూ బీజేపీ-టీఆర్ఎస్ క‌లిసి వ‌రి డ్రామా ఆడుతున్నార‌నేది ఓ ఆరోప‌ణ‌. కాంగ్రెస్‌-రేవంత్‌రెడ్డి ఎద‌గ‌కుండా ఆ రెండు పార్టీలు ప‌ర‌స్ప‌రం పోట్లాడుకుంటున్న‌ట్టు సీన్ క్రియేట్ చేస్తున్నార‌ని.. ఇదంతా అమిత్‌షా-కేసీఆర్‌ల ఎత్తుగ‌డ అంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే ఆరోపించింది. అది నిజ‌మే అన్న‌ట్టు.. ఓవైపు గ‌ల్లీల్లో బీజేపీపై గులాబీ దండు పోరాటం చేస్తుండ‌గా.. కేసీఆర్ మాత్రం ఢిల్లీ వెళ్లి మోదీ ద‌ర్శ‌నం కోసం ప‌డిగాపులు ప‌డుతున్నారు. మీడియా కంట ప‌డ‌కుండా హ‌స్తిన‌లో కొత్త వ్యూహ‌మేదో ర‌చిస్తున్నార‌నే అనుమానం!

ఇక‌, మంగ‌ళ‌వారం కేసీఆర్‌, జ‌గ‌న్‌లు ఇద్ద‌రూ హ‌స్తిన‌లోనే ఉండ‌నున్నారు. రాష్ట్రం కాని రాష్ట్రంలో ఆ ఇద్ద‌రు ర‌హ‌స్య స్నేహితులు సీక్రెట్ మీటింగ్ జ‌ర‌ప‌కుండా ఉంటారా? క‌చ్చితంగా కేసీఆర్‌-జ‌గ‌న్‌ల భేటీ జ‌రుగుతుంద‌ని అంటున్నారు. మ‌రో అడుగు ముందుకేసి.. వారిద్ద‌రి స‌మావేశం కోస‌మే జ‌గ‌న్‌ను ఉన్న‌ప‌ళంగా ఢిల్లీ ర‌ప్పించార‌ని కూడా అంటున్నారు. ఇదంతా మోదీ-బీజేపీ డైరెక్ష‌న్‌లో జ‌రుగుతున్న పొలిటిక‌ల్ డ్రామా అని అనుమానిస్తున్నారు. లేదంటే, ఇటు కేసీఆర్ కానీ, అటు జ‌గ‌న్ కానీ.. ఇద్ద‌రు సీఎంలూ అస‌లేమాత్రం అవ‌స‌రం లేకున్నా.. స‌మ‌యం, సంద‌ర్భం లేకుండా.. స‌డెన్‌గా ఢిల్లీ వెళ్ల‌డం.. మోదీతో భేటీకి ఏర్పాట్లు జ‌రుగుతుండ‌టం.. అంతా వ్యూహాత్మ‌క‌మే కానీ కాక‌తాళీయం మాత్రం అస‌లే కాద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.