రాజకీయ వైరాగ్యమా ... వ్యూహాత్మక మౌనమా? కేసీఆర్ మౌనం దేనికి సంకేతం?
Published on: Tue May 31, 2022 2:11PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ... ఎక్కడున్నారు అంటే .. అయితే దేశాటనలో.. కాదంటే ఫార్మ్ హౌస్’లో, అంతేకానీ, ప్రగతి భవన్’ లో మాత్రం ఉండడం లేదు. ఇది అందరికీ తెలిసిన రహస్యం. గత నెలరోజుల్లో ముఖ్యమంత్రి పట్టు మని పది రోజులు కూడా ప్రగతి భవన్’లో లేరు. రాష్ట్ర పరిపాలనకు సంబందించిన విషయాలను అయితే అసలే పట్టించుకోవడం లేదని అధికారులే అంటున్నారు. గతంలోలాగా అధికారులతో ఇంటరాక్ట్ కావడం లేదు, డిపార్టుమెంటు రివ్యూలు లేవు. ఆదేశాలు లేవు. అక్షింతలు లేవు. రాజకీయ ప్రకటనలు లేవు. ముఖ్యమత్రి ధోరణిలో ఒక విధమైన నిర్లిప్తత కనిపిస్తోందనే మాట అటు పార్టీ వర్గాల్లో, ఇటు అధికార వర్గాల్లో వినిపిస్తోంది.నిజానికి, ముఖ్యమంత్రిలో ఇలాంటి నిర్లిప్తత ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని అధికారులే కాదు, పార్టీ నాయకులు కూడా ఆశ్చర్యం వ్యక్త పరుస్తున్నారు.
ఎందుకిలా ? రాజకీయాలు, రాజకీయాలు మాత్రమే సర్వస్వంగా భావించే, ముఖ్యమంత్రిలో ఈ మార్పు దేనికి సంకేతం? నిజంగానే ఆయనలో రాజకీయ వైరాగ్యం చోటు చేసుకుందా? అలాంటి చాయలు కనిపిస్తున్నాయా, అంటే, అదేమో కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పరిస్థితుల ప్రబావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అటు అధికారులు, ఇటు రాజకీయ నాయకులు, విశ్లేషకులు అందరూ అంగీకరిస్తున్నారు. నిజమే రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలోనూ పరిస్థితులు ఏమాత్రం ఆయనకు అనుకూలంగా లేవు. అది తెలుస్తూనే వుంది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుదామని ఆశిస్తే, అదికాస్తా, ఏదో చేద్దామని ఏదో చేస్తే ఇంకేదో ఎదురైందన్నట్లుగా, ఎక్కడి కక్కడ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అంతే కాకుండా, కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్ దూకుడును కట్టడి చేసేందుకు, తెలంగాణ సర్కార్’ను ఆర్థిక అష్ట దిగ్బంధనంలోకి నెట్టివేసింది. సర్కార్ అప్పులకు సంకెళ్ళు వేసింది. కొత్తగా అప్పులు చేసేందుకు వీలులేకుండా దారులన్నీ మూసుకుపోయాయి. దీంతో ఫస్ట్ తేదీకి కాదు, కనీసం 10-15 తేదీలకు అయినా ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్ సొమ్ములు చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది.
అదొకటి అలా ఉంటే, ఇంటిపోరు ఎక్కువైందని అందుకే ముఖ్యమంత్రి, ప్రగతి భవన్ కంటే ఫారం హౌస్ ‘లోనే ఎక్కువగా ఉంటున్నారని లేదంటే ఏదో ఒక వంకన ఢిల్లీలో మకాం చేసి, అక్కడి నుంచే ఇతర రాష్ట్రాలకు వెళ్లి రావడం జరుగుతోందని అంటున్నారు. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్’ను అర్జెంటుగా ముఖ్యమంత్రిని చేయాలని కుటుంబం నుంచి వత్తిడి వస్తోందని అందుకే ఆయన ఇంటికంటే ఫారం హౌస్ పదిలం అన్నట్ల్గుగా అక్కడే ఉండిపోతున్నారని అంటున్నారు.
నిజానికి, 2018 ఎన్నికల నాటి నుంచి, కేటీఆర్ రేపో మాపో ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జరిగినా, ముహూర్తాలు ఫిక్స్ అయినా, ఎందుకనో అది మాత్రం జరగలేదు. అయితే, ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిసారించిన దరిమిలా తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పుపై మరోసారి చర్చలు జోరందుకున్నాయి. మంత్రి కేటీఆర్’ను ముఖ్యమంత్రిని చేయాలని, కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా తెరాస మంత్రులు. ఎమ్మెల్యేలు కూడా అప్పుడప్పుడు కేటీఆర్’ను ముఖ్యమంత్రిని చేయాలని కోరడం కొత్త విషయం కాదు.బహిరంగ వేదికలు, మీడియా సమావేశాల్లో కేటీఆర్’ను ముఖ్యమంత్రిగా సంభోదించడం, చాలా కాలంగా, ఉన్నదే. అయితే, దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్’ కు భారీ దెబ్బలు తగిలాక కేటీఆర్’ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ కాసింత సర్దుకుంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత అధికార పార్టీనేతలెవరూ ముఖ్యమంత్రి మార్పుపై నోరెత్తలేదు.
అయితే ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాలపైనే ఫోకస్ పెట్టడంతో రాష్ట్రంలో పాలనా పగ్గాలు వారసుడు కేటీఆర్ కు ఇస్తారనే చర్చ మళ్లీ మొదలైంది. నిజానికి పార్టీలో మీడియాలో జరుగుతున్న చర్చ కంటే, కుటుంబంలో వత్తిడే ఎక్కువగా ఉందని, అందుకే తండ్రీ, కొడుకులు ఎడముఖం పెడ ముఖంగా ఉంటున్నారని, అంటున్నారు. అదలా ఉంటే, కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్’కు చెందిన యువకుడు పాదయాత్ర చేస్తుండటంతో ముఖ్యమంత్రి మార్పు ప్రచారం మరింత జోరందుకుంది. ఇదిలా ఉంటే, మరో మూడు నెలల్లో .. దేశ రాజకీయాల్లో సంచలనాలు చూడబోతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్, దసరా రోజుల్లో సంచలన వార్త ఉంటుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు కుమారస్వామి ప్రకటించిన నేపధ్యంలో, దసరానాటికి. కేసీఆర్ తెరాస ప్లీనరీలో ప్రస్తావించినట్లు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేస్తారా? రాష్ట్రాన్ని కేటీఆర్ చేతుల్లో పెట్టి, కేసీఆర్ దేవెగౌడ అడుగుజాడల్లో జాతీయ రాజకీయాలకు పరిమితం అవుతారా? అంతకు ముందే కేటీఆర్’కు బాధ్యతలు అప్పగిస్తారా, లేక కేటీఆర్ పట్టాభిషేకాన్ని మరో మూడు నెలలు వాయిదా వేసేందుకే ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా, దసరా ముహూర్తాన్ని తెర మీదకు తెచ్చారా ? అందుకు కౌంటర్’గానే కేటీఆర్, ఆంధ్రా యువకుడి పాదయాత్ర ప్లాన్ చేశారా? కేటీఆర్ పదోన్నతికి హరీష్ రావు ఆమోదం ఉందా? ఇతర కుటుంబ సభ్యులు అంగీకరిస్తారా? పార్టీలో లుకలుకలు బయట పడతాయా? ఏమి జరుగుతుంది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయిత ఒకటి మాత్రం నిజం, కాంగ్రెస్, బీజేపీలలో కంటే తెరాసలోనే అంతర్గత కుమ్ములాటలు, కుటుంబ సభ్యల మధ్య విబేధాలు ఎక్కువగా ఉన్నాయి అనేది మాత్రం నిజం, అని అంతర్గత సమాచారంగా ప్రచారం జరుగుతోంది. తెరాసలో అంతా బాగుంది, అధికార మార్పిడి సాఫీగా సాగిపోతుందని ఎవరైనా ఆనుకుంటే, అది తప్పే అవుతుంది. నిజానికి, మరే పార్టీలోనూ లేనంతగా తెరాసలో నివురు గప్పిన నిప్పులా అసమ్మతి రగులుతోంది. ఒక్కసారి, భగ్గుమనేందుకు సిద్దంగా వుంది. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ వత్తిడి ఎంతగా ఉన్నా. కుమారుడి కేటీఅర్ పట్టాభిషేకాన్ని ఏదో సాకున వాయిదా వేస్తున్నారని అంటున్నారు. ఇక ఇప్పడు ఏమి చేస్తారు అన్నది చూడవలసి వుంది.


