పాపం పోలీసులు..!
Published on: Wed Jun 8, 2022 10:26AM
కనిపించే మూడు సింహాలు చట్టం, న్యాయం, ధర్మం అయితే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్.. పోలీస్.. పోలీస్.. అంటూ పోలీస్ స్టోరీ సనిమాలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ చెప్పిన డైలాగ్.. అలా ఇలా కాదు.. పోలీస్ తుపాకీలోంచి దూసుకొచ్చిన తూటాలా గట్టిగానే పేలింది. కానీ ఆ నాలుగో సింహం.. నేడు అధికార పార్టీ నేతల వద్ద గ్రామ సింహంలా మారిపోయిందని పోలీసు శాఖలోని ఉన్నత అధికారి నుంచి కింద స్థాయిలో కానిస్టేబుల్ వరకు అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేరుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటుంటారు కానీ నిత్యం బిక్కు బిక్కుమంటున్నామని వారు భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖలో విధుల్లో చేరేటప్పుడు చేసిన ప్రమాణాలకు సంబంధమే లేకుండా. ఆ తర్వాత చేస్తున్న ఉద్యోగం.. ఉడిగంలా తయారైందనీ వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుత అధికార పార్టీ నేతలకు జీ హూజురంటూ.. స్వేచ్చగా విధులు నిర్వహించుకోలేని దుస్థితిలో పోలీస్ శాఖ ఉందని వారు పేర్కొనడం గమనార్హం.
అంతేకాదు.. అసలు తమ శాఖ.. ఎవ్వరికీ సేవలందిస్తోంది... సామాన్య ప్రజలకా? అధికార పార్టీ నేతలు, లేక బడా బాబులాకా అనే డైలమాలో తాము ఉన్నామంటున్నారు. ఏదైనా నేరం.. ఘోరం జరిగినప్పుడు.. కేసు నమోదు చేసి.. విచారణ జరిపి.. వాస్తవాలు బయటకు తీసుకు వచ్చే పరిస్థితి నేడు లేదని .. పోలీసులు వాపోతున్నారు.
అయితే గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిలా మారుతోందని.. ఏదో రోజు.. ఇదే పరిస్థితి అధికార పార్టీకి ఎదురవుతోందని .. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని వారు అంటున్నారు. ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తున్నా... విధి నిర్వహణలో మాత్రం స్వేచ్ఛ లేకపోవడం వల్ల.. అధికార పార్టీ నేతల కబంధ హస్తాల నుంచి బయటపడేందుకు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించామని ఇప్పటికే పోలీస్ శాఖలోని కింది స్థాయి ఉద్యోగులు చెబుతున్నారు.
ఆ క్రమంలోనే.. ప్రభుత్వ వైఫల్యాలతోపాటు అధికార పార్టీ ముసుగులో నేతలు.. వారి పుత్రరత్నాలు చేస్తున్న ఆరాచకాలు, అకృత్యాలకు సంబంధించిన లీకులు.. విపక్ష నేతలకు ఇచ్చి.. వారి ద్వారా బడాబాబులు, అధికార పార్టీ నేతల సంబధీకులపై కేసుల బలపడేందుు పోలీసులు దోహదపడుతున్న సందర్భాలు లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు. హత్యలు, రేప్‌లు, అక్రమాలు, అరాచకాలు చేసే వారికి అధికార పార్టీ నేతలు అండదండలతో.. వారికి పాద సేవలు చేయాల్సి వస్తోందని పోలీసు శాఖలోని కింద స్థాయి అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని ... ఆ కలియుగ దైవం ఏడుకొండలవాడికి నమస్కారం పెట్టి మరీ కోరుకొంటున్నామంటే తమ పరిస్థితి అర్థం చేసుకోవచ్చని ఓ ఉన్నతాధికారే పేర్కొనడం గమనార్హం. అయితే ఈ ఖాకీ వనంలో కొందరు ఉన్నతాధికారులకు అవినీతి చీడ పట్టిన గంజాయి మొక్కలు ఉన్నాయని.. అలాంటి వారి వల్ల నిబద్ధతతో విధులు నిర్వహించేవారికి అవమానాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలు సామాన్య మానవుడుకి పోలీసులు చూస్తే.. భయంతో కూడిన భక్తి కలగాలని.. కానీ వీడో 420 అనే పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉందని పోలీసులే పేర్కొనడం గమనార్హం. అధికార పార్టీ నేతల .. మాటలు వినకంటే.. ఏ మారుమూల ప్రాంతానికి పోస్టింగ్ ఇస్తారనే ఓ విధమైన భయాందోళనలతో.. మనస్సుని.. మనస్సాక్షిని చంపుకొని మరీ వారు చెప్పినట్లు సై ఆటా ఆడాల్సి వస్తోందని వారు ఆవేదనతో చెబుతున్నారు.
పోలీస్ శాఖ మీద రాజకీయ ప్రాబల్యం లేకుండా ఉండేలా.. ఓ పటిష్టమైన చట్టం తీసుకు వస్తే.. తమ మానాన.. తాము పని చేసుకుపోతామని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ పోలీస్ ఉన్నతాధికారి .. తన మనస్సులోని మాటను బయట పెట్టడం విశేషం. అలా కాకుండా.. ప్రస్తుత స్థితే కొనసాగితే.. అధికార పార్టీ నేతలు ఇలా తమ జీవితాలపై కొడుతున్న కౌకు దెబ్బలకు.. తాము మనస్సులనే మూగగా రోధించాల్సి వస్తోందని వారు అంటున్నారు. ఏదీ ఏమైనా వంటి మీద ఖాకీ డ్రస్.. నెత్తిమీద మూడు సింహాలు.. చేతిలో లాఠీ వచ్చే సరికి.... పోలీస్ శాఖలో ఉద్యోగం ఠీవీగా చేయచ్చు అనుకుంటే.. ఇలా అధికార పార్టీ నేతలకు ఊడిగం చేయాల్సిన పరిస్థితి దాపురించిందని వారు పేర్కొనడం గమనార్హం.


