TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో జోగి రమేష్ అరెస్ట్?

Published on: Tue Aug 20, 2024 2:40PM

ఎవరు చేసిన ఖర్మ వారనుభవింపకా తప్పదన్నా అన్నట్లు జగన్ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా చెలరేగిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఫలితం అనుభవించబోతున్నారు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా చెలరేగి.. ఎదురేలేదన్నట్లుగా రెచ్చిపోయిన మాజీ మంత్రి జోగి రమేష్ కు ఇప్పుడు ఒకదాని తరువాత ఒకటిగా చిక్కులు చుట్టుముడుతున్నాయి. గతంలో చేసిన తప్పిదాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోకతప్పని పరిస్ధితి ఏర్పడింది. అగ్రీగోల్డ్ భూ కుంభకోణంలో జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో కొద్ది రోజుల కిందట పోలీసుల విచారణకు హాజరైన జోగి రమేష్ కు పోలీసులు మరో సారి సమన్లు జారీ చేశారు. మంగళవారం (ఆగస్టు 20) రెండు గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. పోలీసుల సమన్ల మేరకు తన న్యాయవాదితో కలిసి జోగి రమేష్  పోలీసు విచారణకు హాజరయ్యారు. 
2021లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ కేసులో జోగి రమేష్ సహా పలువురు వైసీపీ సీనియర్ నేతలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కాగా కొద్ది రోజుల కిందట అగ్రిగోల్డ్ భూముల కుంభకోణం విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆ తరువాత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అరెస్టు చేశారు.  అగ్రీగోల్డ్ కేసులో జోగి రమేష్ కూడా నిందితుడిగా ఉన్నారు. అదలా ఉంచితే ఇప్పుడు ఓ వైపు కుమారుడు అరెస్టై జైల్లో ఉన్న సమయంలో తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు జోగి రమేష్ ను ప్రశ్నిస్తున్నారు. స్వల్ప వ్యవధిలో రెండో సారి విచారణకు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఏ క్షణంలోనైనా జోగి రమేష్ అరెస్టయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

జగన్ హయాంలో జోగి రమేష్ ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా నడిచిపోయింది. గురివింద గింజ సామెతలా.. తాను ఓ వైపు అక్రమాలకు పాల్పడుతూ, భూదందాలు, కబ్జాలకు పాల్పడుతూ.. అప్పటి ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న జోగి రమేష్ ఇప్పుడు అధికారం అండ చూసుకుని పాల్పడిన అక్రమాలకు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితుల్లో పడ్డారు.