ఎమ్మెల్యే స్టిక్కర్ కారులో 5 కోట్లకు పైగా నగదు పట్టివేత.. ఏపీలో రాజకీయ దుమారం

ఏపీ బోర్డర్ కు దగ్గరలో తమిళనాడు లోని గుమ్మడిపూండి దగ్గర ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు లో 5.27 కోట్లను తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆ కారులో ఉన్న ఒంగోలుకు చెందిన ముగ్గ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ నుండి చెన్నై కి గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని ఆరంబాక్కం పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందడంతో తెల్లవారుజామున ఎలావురు లోని చెక్ పోస్ట్ వద్ద వాహనాల ను చెక్ చేయడం మొదలు పెట్టారు. అపుడే అటుగా ఎమ్మెల్యే స్టిక్కర్ తో వచ్చిన కారును చెక్ చేయగా వెనుక సీటులో కొన్ని బ్యాగులు కనిపించాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా వాటిలో ఏకంగా 5 కోట్లకు పైగా నగదు ఉండడంతో దానిని స్వాధీనం చేసుకుని ఆ వాహనంలో ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. వీరిని ఒంగోలుకు చెందిన వసంత్, నాగరాజు, కారు డ్రైవర్ సత్యనారాయణ గా గుర్తించారు. ఐతే నగదు తరలిస్తున్న కారు మాత్రం తమిళనాడు రిజిస్ట్రేషన్ తో ఉన్నట్లు సమాచారం. ఐతే ఈ కారు పై ఒంగోలుకు చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడం తో అనేక అనుమానాలు మొదలయ్యాయి. అంతే కాకుండా తనిఖీ జరిగే సమయంలోనే మరో ఇద్దరు తప్పించుకు పారిపోయారని ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒక రాజకీయ నాయకుడి కుమారుడు, మరో బంగారు వ్యాపారి ఉన్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు.

ఘటన పై లోతైన దర్యాప్తు కోరిన మంత్రి బాలినేని
ఈ ఘటన తో ఇపుడు ఏపీలో తీవ్ర దుమారమే రేగుతోంది. ఆ ఘటన పై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ చెన్నై వెళుతున్న ఒక కారుపై నా పేరుతొ ఉన్న స్టిక్కర్ ఉన్నట్లుగా మీడియాలో ఈ ఉదయం వార్తలు వచ్చాయి. ఆ స్టిక్కర్ ఫోటో జిరాక్స్ కాపీ. అంతే కాకుండా అరెస్ట్ ఐన వారు ఒంగోలుకు చెందిన వారు కావడంతో తనకు అంటగడుతున్నారని వాపోయారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ తో ఉన్న కారులో 5 కోట్లకు పైగా నగదు ఉందని చెపుతున్నారు. దీని పై అన్ని కోణాలలో లోతుగా దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నానన్నారు.