రేవంత్ రెడ్డి విడుదల.. భారీ భద్రత మధ్య కొడంగల్‌కు

 

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయంలో ఎట్టకేలకు పోలీసులు దిగొచ్చారు. సీఈసీ రజత్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు రేవంత్ రెడ్డిని  కొద్దిసేపటి క్రితమే భారీ భద్రత మధ్య కొడంగల్‌కు తరలించారు.

ఇప్పటికే హైకోర్టు రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయంలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ పర్యటన సందర్భంగా రేవంత్‌ రెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారని, శాంతిభద్రతల దృష్ట్యా ఆయన్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు.. బంద్‌కు రేవంత్‌ పిలుపునిస్తే తప్పేంటని, ఆయనను అదుపులోకి తీసుకొని ఏ నేరాన్ని నియంత్రించారని ప్రశ్నించింది. ఇంటెలిజెన్స్‌ సమాచారం నివేదిక ఆధారంగానే రేవంత్‌ను అరెస్టు చేశామని పోలీసులు చెప్పగా.. ఆ నివేదిక ఏంటో, దానిలో ఏముందో ఆ వివరాలను తమ ఎదుట ఉంచాలని ఆదేశిస్తూ అందుకు అరగంట సమయం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఆధారాలు రేపు సమర్పిస్తామని పోలీసులు గడువు కోరగా.. పోలీసుల తీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ ఆయన అరెస్టు సక్రమంగా ఉంటే ఆధారాలు ఇవ్వడానికి ఇబ్బందేమిటని ప్రశ్నించింది. ఈ రోజే దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు, కారణాలు తమకు చెప్పాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

ఒక పక్క హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజకుత్ కుమార్ లేఖ రాశారు. రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయండని ఆదేశించారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నేతల వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకున్న రజత్ కుమార్ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు దిగొచ్చి రేవంత్ రెడ్డిని విడుదల చేశారు.