TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిగ్గు సిగ్గు.. జ‌గ‌న్‌ కాన్వాయ్ కోసం వెంక‌న్న‌ భ‌క్తుల కారు.. అర్థ‌రాత్రి అరాచ‌కం

Published on: Thu Apr 21, 2022 11:54AM

ఏపీ ప్ర‌భుత్వం సిగ్గు ప‌డాలి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసులు చేసిన ప‌నికి త‌ల‌దించుకోవాలి. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న‌కు మ‌రో నిద‌ర్శ‌నం ఇది. పాపం.. ఆ కుటుంబం.. అర్థ‌రాత్రి న‌డిరోడ్డున ప‌డాల్సి వ‌చ్చింది. తిరుమ‌ల‌ శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్తున్న ఆ భ‌క్తులు.. పోలీసుల ఝులంతో తీవ్ర ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింది. సీఎం జ‌గ‌న్ కాన్వాయ్ కోసమంటూ.. ఖాకీలు చేసిన‌ ఓవ‌రాక్ష‌న్‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విష‌యం తెలిసి టీడీపీ అధినేత చంద్ర‌బాబు మండిప‌డ్డారు. జ‌రిగిన దారుణాన్ని ఎండ‌గ‌ట్టారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే...

పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఐదుగురు స‌భ్యుల‌ వేమల శ్రీనివాస్‌ కుటుంబం వెంక‌న్న‌ దర్శనం కోసం ఇన్నోవా కారులో తిరుమల వెళ్తున్నారు. మార్గ‌మ‌ధ్య‌లో భోజంన చేద్దామ‌ని.. బుధవారం రాత్రి 10 గంటల త‌ర్వాత ఒంగోలులో ఆగారు. పాత మార్కెట్‌ సెంటర్‌లో వాహనం ఆపి.. టిఫిన్‌ చేస్తుండగా ఓ కానిస్టేబుల్‌ అక్కడికి వచ్చారు. ఈ నెల 22న సీఎం జ‌గ‌న్ ఒంగోలు టూర్ ఉంద‌ని.. ముఖ్య‌మంత్రి కాన్వాయ్‌ కోసం మీ వాహనంతో పాటు డ్రైవర్ కూడా కావాల‌ని డిమాండ్‌ చేశారు. తాము కుటుంబంతో తిరుమల వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు సార్‌.. మీకు సారీ చెప్పడం మిన‌హా తానేమీ చేయలేనంటూ.. తిరుమ‌ల వెళ్తున్న ఆ భ‌క్తుల‌ కారును, డ్రైవర్‌ను బ‌ల‌వంతంగా తీసుకెళ్లిపోయాడు ఆ కానిస్టేబుల్‌.     

పాపం.. శ్రీనివాస్‌ ఫ్యామిలీ.. అర్థ‌రాత్రి.. ఊరుగాని ఊరు.. న‌డిరోడ్డుపై ఉండిపోయింది. ఏం చేయాలో తెలీలేదు.. ఎవ‌రిని అడ‌గాలో.. తిరుమ‌ల‌కు ఎలా వెళ్లాలో అర్థం కాలేదు. పోనీ, తిరిగి ఇంటికెళ్దామ‌న్నా ఆ నైట్ వాహ‌నం ఎలా? ఆ రాత్రి ఎక్క‌డుండాలి?  తెచ్చుకున్న వాహ‌నాన్ని సీఎం కాన్వాయ్ కోస‌మంటూ పోలీసులు లాక్కెళ్లారు. మ‌హిళ‌లు, పిల్ల‌ల‌తో స‌హా.. రాత్రి పూట రోడ్డుపై నిలుచుండిపోయారు. ఇంత‌టి దారుణ ప‌రిస్థితి ఇంకెవ‌రికీ రాకూడ‌దు. విష‌యం మీడియా దృష్టికి రాగా క‌ల‌క‌లం చెల‌రేగింది. ఒంగోలు పోలీసుల‌ను ప్ర‌శ్నిస్తే త‌మ ద‌గ్గ‌ర స‌మాచారం లేద‌ని చెప్పారు. 

ఘ‌ట‌న‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం స్పందించారు. సీఎం జగన్‌ కాన్వాయ్‌ కోసం తిరుమల వెళ్లే భక్తుల కారును లాక్కెళ్లారని.. రాష్ట్రంలో దౌర్భాగ్య పాలనకు ఇదే నిదర్శనమని మండిపడ్డారు. ‘‘భార్య, పిల్లలతో వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డుపై దింపే హక్కు ఎక్కడిది? కాన్వాయ్‌ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకెళ్లింది? ప్రభుత్వ అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడతారా? అధికారుల చర్యలతో ప్రజలకు ఏం సమాధానం చెబుతారు’’ అని నిలదీశారు.