TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రిటైర్డ్ ఐఏఎస్ పీవీ ర‌మేశ్ పేరెంట్స్‌కి నోటీసులు.. సీఐడీ సునీల్‌కుమార్‌పై రఘురామ ఆరోప‌ణ‌లు..

Published on: Wed Jan 19, 2022 10:40AM

సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ కాంట్ర‌వ‌ర్సీకి కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఇటు ఫ్యామిలీ గొడ‌వ‌లు.. అటు ర‌ఘురామ‌తో త‌గాదాలు.. మ‌రోవైపు టీడీపీ వారిపై క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లు.. ఇలా జ‌గ‌న‌న్న క‌నుస‌న్న‌ల్లో సునీల్‌కుమార్‌ రెచ్చిపోతున్నార‌నే ఆరోప‌ణ‌లు తీవ్రంగా ఉన్నాయి. 

ఎంపీ ర‌ఘురామను అరెస్ట్ చేయ‌డం.. క‌స్ట‌డీలో థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌నే వివాదంతో సునీల్‌కుమార్ పేరు ఒక్క‌సారిగా మారుమోగిపోయింది. ఆ త‌ర్వాత ఆయ‌న‌పై ఏకంగా కేంద్రం హోంశాఖ‌కే ఫిర్యాదులు వెళ్లాయి. సోష‌ల్ మీడియాలో వివాదాస్ప‌ద ప్ర‌సంగాల వీడియోలు మ‌రింత క‌ల‌క‌లం సృష్టించాయి. ఇవ‌న్నీ చాల‌వ‌న్న‌ట్టు.. కుటుంబ క‌ల‌హాల్లోనూ సీఐడీ బాస్ సునీల్ కుమార్ పేరు ప‌దే ప‌దే వినిపిస్తుంటుంది. 

తాజాగా, రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ తల్లిదండ్రులకు విజయవాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ కొండాపూర్‌లో పీవీ రమేష్ పేరెంట్స్‌ నివసించే ఇంటికి ముగ్గురు ఏపీ పోలీసుల బృందం వ‌చ్చింది. ఓ కేసు విషయంలో 22న విచారణకు రావాలని నోటీసు ఇచ్చార‌ని తెలుస్తోంది. 

త‌మ అల్లుడు సునీల్‌కుమార్ ప్రోద్బ‌లం వ‌ల్లే ఏపీ పోలీసులు త‌మ‌కిలా నోటీసులు ఇచ్చార‌ని పీవీ ర‌మేశ్ త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఫ్యామిలీ గొడ‌వ‌ల‌తో ఇప్ప‌టికే సునీల్‌కుమార్‌పై కేసు పెట్టామ‌ని.. అది విచార‌ణ‌లో ఉంద‌ని.. త‌మ‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేయ‌డానికే.. ఇలా పోలీసుల‌తో నోటీసులు ఇప్పించార‌ని వారు ఆరోపిస్తున్నారు. 

మ‌రోవైపు, తాజా ప‌రిణామంపై వైసీపీ రెబెల్ ఎంపీ ర‌ఘురామ జోక్యం చేసుకున్నారు. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు రఘురామ లేఖ రాశారు. పీవీ సునీల్ కుమార్‌పై వరకట్నం వేధింపుల కింద తెలంగాణలో కేసు నమోదు అయిందని లేఖలో తెలిపారు. భార్య పిర్యాదు మేరకు సునీల్‌పై తెలంగాణలో ఛార్జ్ షీట్ నమోదు చేశారని చెప్పారు. 

పీవీ సునీల్ కుమార్.. భార్య, తల్లిదండ్రులపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారన్నారు. పార్లమెంట్ సభ్యుడి హోదాలో రాష్ట్రంలో శాంతిభద్రతల దృష్ట్యా వరుస ఘటనలపై విచారణ జరిపి పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, వారిపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ లేఖ రాశారు. పీవీ సునీల్‌ను తక్షణమే సీఐడీ చీఫ్ పోస్ట్ నుంచి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణం రాజు లేఖలో విజ్ఞ‌ప్తి చేశారు.