TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డ్రగ్స్ మహమ్మారికి అంతం లేదా?

Published on: Tue Apr 5, 2022 4:26PM

రాజధాని భాగ్యనగరానికి డ్రగ్స్ కొత్తేమీ కాదు. గతంలో పలుమార్లు నగరంలో డ్రగ్స్ పట్టుబడడం, కొందరిని అరెస్టు చేయడం, అనంతరం వారిని విడిచిపెట్టడం మామూలే. అయితే ఈసారి నగరంలో ఇదో సంచలనంగా మారింది. ఏ నోట విన్నా డ్రగ్స్ పారాయణమే. సంబంధం లేని సామాన్యులుకూడా డ్రగ్స్ గురించే చర్చ. ఇక మీడియాలో దీనికి సంబంధించిన కథనాలు ధారావాహికలా వెలువడుతున్నాయి. ఆదివారం తెల్లవారు జామున నగరంలోని బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై పోలీసులు దాడిచేసి పలువురిని అదుపులోకి తీసుకోవడం, అందులో రాజకీయ నాయకులతో సంబంధాలున్నవారు, సినీ రంగ సన్నిహితులు ఉండడంతో డ్రగ్స్ పై పుంఖానుపుంఖాలుగా సమాచారం  వెలువడుతున్నది. అయితే దీనిపై పోలీసులు దర్యాప్తులో పెద్దగా ముందంజ వేసింది లేదు. పబ్ మేనేజర్ మరికొంతమంది అనామకులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడం తప్ప దీని వెనుకున్న బడాబాబుల గుట్టు రట్టు చేయడంలో విఫలమయ్యారనే చెప్పకతప్పదు. రైడ్ జరిగిన పబ్ మాజీ ఎంపీ కుమార్తెది కావడంతో పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పబ్ భాగస్వామి అభిషేక్ ఫోన్ ను విశ్లేషించిన పోలీసులు అతనికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో సంబంధాలున్నట్టు కనుగొన్నారు. అతడిని కష్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే కీలక సమాచారం లభించే అవకాశముందని భావిస్తున్నారు. 

సీఎం పర్యటనకు దక్కని ప్రాధాన్యం
ఈ డ్రగ్స్  హడావిడిలో సీఎం కేసీఆర్ దేశరాజధాని దిల్లీ పర్యటన వార్తకుకూడా ప్రాధాన్యం ఇవ్వకపోవడం గమనార్హం.  చాలా మాధ్యమాలు డ్రగ్స్ వార్తలు, దాని అనుబంధ వార్తలకే ప్రాధాన్యమిచ్చాయి.  సీఎం ఎపుడు ఢిల్లీకి వెళ్లినా ఆ వార్తకు సంబంధించిన సమాచారం అందించే మీడియా ఈసారి ఆయన పర్యటనకు అంత ప్రాధాన్యమివ్వకపోవడం చర్చనీయాంశమైంది. 

రైడ్ జరిగిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో పోలీసులు ప్రధానంగా మూడు టేబుల్స్ వద్ద పార్టీ చేసుకున్న కస్టమర్ల పైనే ఫోకస్ చేశారు. వీడియో ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ఆ సమయంలో ఆ గది చీకటిగా ఉండడంతో పార్టీ చేసుకున్న వారి ముఖాలు సరిగా కనిపించనట్టు తెలిసింది.  కాగా పబ్ లోకి మైనర్లను అనుమతించడంపైకూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పబ్ నిర్వాహకులు మైనర్లను అనుమతించలేదని బుకాయిస్తున్నా పోలీసులు ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అసలు పబ్ లోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయన్న అంశంపైకూడా పోలీసులు, నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయని సమాచారం. నగరంలో డ్రగ్స్ పెడ్లర్లను అదుపు చేస్తే సమాజానికి పట్టిన ఈ పీడను వదిలించుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

మద్యం అనుమతులపై ఆరా తీసినపుడు తమకు 24 గంటలూ మద్యం సరఫరా చేసేందుకు అనుమతి ఉందని పబ్ నిర్వాహకులు చెప్పడం గమనార్హం. అయితే ఆ అనుమతులు ఉమ్మడి రాష్ర్టంలో జారీ చేసినవని, వాటిని రెన్యూవల్ చేయించుకుంటున్నట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. పబ్ పై పలుసార్లు ఫిర్యాదులు వచ్చినా సరైన చర్యలు చేపట్టకపోవడంతో నేడు అది విశ్వరూపం దాల్చిందనేది సుస్ఫష్టం.  ఇకనైనా పోలీసులు చట్టపరిధిలో పబ్ లపై పట్టు బిగిస్తే డ్రగ్స్ మహమ్మారిని అదుపు చేయడం అసాధ్యం కాబోదు.