విశాఖలో డాక్టర్‌ నిరసన.. తాళ్లు కట్టి స్టేషన్‌కు తరలింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం మాస్క్‌లు కూడా ఇవ్వడం లేదంటూ పెద్ద ఎత్తున దుమారం రేపిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ విశాఖలో రోడెక్కారు. క‌నీసం శరీరం మీద చొక్కా లేకుండా ధర్నాకు దిగారు.  గుండు గీయించుకొని, కనుబొమలు  తీసేసి నిర‌సంగా క‌నిపించారు. 

అయితే, ఆయన రోడ్డు మీద వెళ్లే వారితో అనుచితంగా ప్రవర్తించారంటూ ఫిర్యాదు రావడంతో పోలీసులు డాక్టర్ సుధాకర్ చేతుల్ని వెనక్కు కట్టేసి  విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. అనంతరం అక్కడి నుంచి కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ సుధాకర్‌కు చికిత్స అనంతరం కౌన్సెలింగ్ అందిస్తారని వైద్యులు చెబుతున్నారు. డాక్ట‌ర్ సుధాకర్ ఫుల్లుగా మద్యం తాగి ఉన్నారని విశాఖ సీపీ ఆర్కే మీనా తెలిపారు. 

నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి చెందిన ఎనస్ధీషియన్ డాక్టర్‌గా సుధాకర్ పనిచేశారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని తనకు మాస్కులు, పీపీఈ , కిట్లు లేవంటూ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేసిన తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో ఆయన్ని సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు అప్పట్లో ఆయన నర్సీపట్నం పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఉద్యోగం నుంచి తొలగించినప్పటి నుంచి సుధాకర్ మానసికంగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సుధాకర్‌ను ఓ క్రిమినల్ మాదిరిగా తాళ్లతో కట్టి స్టేషన్‌కు తరలించడంపై పోలీసులపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

దళిత డాక్టర్ సుధాకర్ పై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలన్నారు. సుధాకర్ కు అత్యున్నత వైద్య చికిత్స అందించాలని కోరారు. ఈ దురాగతానికి సీఎం జగన్ బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.