TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భూమన హౌస్ అరెస్ట్?.. ఖండించిన పోలీసులు

Published on: Thu Apr 17, 2025 10:54AM

తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో గోవులు మరణించాయంటూ టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి చేసిన ఆరోపణలను ఖండించింది. అసత్య ప్రచారమని స్పష్టం చేస్తూనే, వాస్తవానికి కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు జరిగాయని ప్రత్యారోపణ చేసింది. ఈ నేపథ్యంలోనే బుధవారం గోశాలను సందర్శించిన సీపీఐ జాతీయ కార్యదర్శి గోశాలలో గోవుల మృతి అన్నది నిరాధార ఆరోపణ అని చెప్పడమే కాకుండా, గోశాల నిర్వహణ భేషుగ్గా ఉందని కితాబు నిచ్చారు.

ఇలా ఉండగా  తిరుమల తిరుపతి దేవస్థానం  గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి టీడీపీ సవాల్‌ విసిరింది. గోశాలకు వచ్చి గోమాతలను చూడాలని పేర్కొంది. కాగా  తెలుగుదేశం సవాల్ ను స్వీకరించిన భూమన గురువారం (ఏప్రిల్ 17) ఉదయం గోశాలకు వస్తానని ప్రకటించారు. భూమన గోశాల సందర్శనకు పోలీసులు కూడా అనుమతించారు. అంత వరకూ బానే ఉంది.. కానీ ఉదయం నుంచీ వైసీపీ భూమనను హౌస్ అరెస్టు చేశారంటూ గగ్గోలు పెట్టడం ప్రారంభించింది. భూమన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. ఒక్క భూమననే కాకుండా వైసీపీ నేతలు పలువురిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారంటూ వైసీపీ ఆరోపణలు గుప్పించింది. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు.

భూమన  కరుణాకరరెడ్డి గోశాల సందర్శనకు ఎటువంటి అభ్యంతరం లేదనీ, ఆయనకు అనుమతి ఇచ్చామనీ స్పష్టం చేశారు. అయితే  వైసీపీ నేతలు, తెలుగుదేశం నేతలు ఒకే సారి గోశాల వద్దకు వెళ్లడానికి అనుమతించబోమన్నారు. అలాగే భూమన కూడా వ్యక్తిగత భద్రతా సిబ్బంతితో మాత్రమే గోశాలకు వెళ్లాలనీ వెంట పెద్ద సంఖ్యలో అనుచరులను అనుమతించబోమనీ పోలీసులు స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరిమిత సంఖ్యలో మాత్రమే గోశాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు.