'సింగం' తరహా పోలీస్ ఛేజింగ్.. రెండు కార్లను వెంటాడి.. ఏం జరిగిందంటే..
Published on: Thu Nov 11, 2021 9:52AM
పోలీసులు రోడ్డుపై వాహనాలు చెక్ చేస్తున్నారు. రెగ్యులర్‌గా చేసే డ్యూటీనే. అంతలోనే అటువైపు రెండు కార్లు దూసుకొచ్చాయి. ఆపమంటే ఆపలేదు. మరింత స్పీడ్ పెంచి.. రయ్‌న దూసుకుపోయారు. అప్పటి వరకూ క్యాజువల్‌గా డ్యూటీ చేస్తున్న కాప్స్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఇలాంటి ఛీజింగ్ ఛాన్స్ ఎప్పుడో కానీ రాదాయే. అప్పుడే సింగం సినిమా చూసొచ్చిన వారిలా.. పోలీస్ వెహికిల్‌కి సైరన్ వేసుకొని.. కుయ్ కుయ్ మంటూ ఆ రెండు కార్లను వెంబడించారు. ముందు పారిపోతున్న రెండు కార్లు.. వెనకాలే పోలీస్ వెహికిల్. ఎంత స్పీడ్ పెంచినా.. పట్టుకోలేకపోతున్నారు. అలా అలా 15 కిలోమీటర్లు వెంబడించారు. అప్పటికి కూడా ఖాకీలు ఆ కార్లను ఏమీ ఓవర్‌టేక్ చేయలేదనుకోండి. పారిపోతున్న వారే పోలీసులకు భయపడి.. రెండు కార్లను రోడ్డు పక్కన ఆపేసి.. లాక్ చేసేసి.. వాటిని వదిలేసి పారిపోయారు. ఇంతకీ.. వారెందుకు పారిపోయారు? వారు ఎవరు? ఆ కారులో ఏముంది? ఈ పోలీస్ చేజింగ్ సీన్ ఎక్కడ జరిగింది?
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంట దగ్గర జరిగిందీ యాక్షన్ ఎపిసోడ్. విశాఖ ఏజెన్సీ నుంచి గజపతినగరం వైపు వస్తున్న ఒడిస్సాకు చెందిన కార్లను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. కార్లు ఆపకపోవటంతో సుమారు 15 కిలో మీటర్ల మేర వెంబడించారు. పురిటిపెంట దగ్గర కార్లకు తాళాలు వేసి ముగ్గురు నిందితులు పారిపోయారు. అతికష్టం మీద ఒకరిని పట్టుకున్నారు.
ఆ రెండు కార్లలో బ్యాగులు ఉన్నాయి. వాటిలో గంజాయి ఉన్నట్టు అనుమానిస్తున్నారు. పారిపోయిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని.. పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు.


