సీఎంను తిట్టారంటూ అయ్యన్నపై కేసు.. అరెస్ట్ తప్పదా?
Published on: Tue Feb 22, 2022 10:37AM
టీడీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ అంటే ఎవరు? గతంలో అయితే ఏ చింతమనేనినో, జేసీ పేరునో చెప్పేవారు. కానీ, లేటెస్ట్‌గా ఆ ఫైర్ బ్రాండ్ ఇమేజ్.. ఓ వెటరన్ లీడర్ సొంతం చేసుకున్నారు. ఆయనే.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.
అవును, టీడీపీలో ఇప్పుడు ఫైర్ ఉన్న నాయకుడు అయ్యన్ననే. ఎప్పటికప్పుడు సీఎం జగన్‌రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. మాటలతో మంటరాజేస్తున్నారు. ఆ దూకుడులో కాస్త నోరు కూడా జారుతున్నారు. కంట్రోల్ తప్పో.. లేక, సిచ్యుయేషన్ డిమాండ్ చేసో.. కాస్త స్పైసీగా మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు ఆయన్ను ఇరకాటంలో పడేసేలా ఉంది. అసలే, టీడీపీ నేతలు ఎక్కడ దొరికితే అక్కడ కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి కాచుకు కూర్చున్న ప్రభుత్వం-పోలీసులు.. తాజాగా అయ్యన్న పాత్రుడిపై ఫోకస్ పెట్టినట్టున్నారు.
తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిపై పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో కేసు నమోదైంది. వైసీపీ నేత రామకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లజర్లలోని ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించారని అయ్యన్నపై రామకృష్ణ ఫిర్యాదు చేశారు. దీంతో అయ్యన్నపై 153ఎ, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యన్నను అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి.


