ఫ్లాష్.. ఫ్లాష్.. తీన్మార్ మల్లన్న ఆఫీసుపై మళ్లీ పోలీసుల దాడి...
Published on: Wed Aug 25, 2021 5:17PM
సీఎం కేసీఆర్, తెలంగాణ సర్కారును తీన్మార్ మల్లన్న ఓ పట్టాన వదలడం లేదు. అలాగే, పోలీసులు సైతం చింతపండు నవీన్‌ను వదల మల్లన్నా అంటూ వెంటబడుతున్నారు. గతంలో ఓసారి ఆయన ఆఫీసుపై దాడి చేసిన పోలీసులు.. తాజాగా మరోసారి క్యూ-న్యూస్ ఆఫీసుపై అటాక్ చేశారు. భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు ఒక్కసారిగా మల్లన్న కార్యాలయాన్ని చుట్టుముట్టారు. సిబ్బంది అందరినీ కదలకుండా కట్టడి చేశారు. వారి నుంచి సెల్‌ఫోన్లు లాక్కున్నారు. బయటి వారినెవరినీ లోనికి అనుమతించడం లేదు. లోని వారిని బయటకు పంపించడం లేదు. కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను పరిశీలిస్తున్నారు.
మంగళవారం టీఆర్ఎస్ సోషల్‌మీడియా వింగ్.. తీన్మార్ మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం పోలీసులు క్యూ-న్యూస్ ఆఫీసుపై దాడి చేయడం కలకలంగా మారింది. గతంలోనూ ఓ యువతి ఫిర్యాదు మేరకు ఇలానే అటాక్ చేశారు పోలీసులు. క్యూ-న్యూస్ ఛానెల్‌పై మూకుమ్మడి దాడి చేసి కంప్యూటర్లు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకొని నానా హంగామా చేశారు. ఓ కేసు బుక్ చేసి వదిలేశారు. అంతే. అంతకుమించి ఏమీ చేయలేకపోయారు. ఆ తర్వాత మల్లన్న కోర్టును ఆశ్రయించడం జరిగింది. తాజాగా ఇప్పుడు మరోసారి పోలీసులు క్యూ-న్యూస్ ఆఫీసుపై రైడ్ చేయడం కలకలం రేపుతోంది. పోలీసుల దాడి విషయం తెలిసి.. మల్లన్న అభిమానులు పెద్ద సంఖ్యలో క్యూ-న్యూస్ కార్యాలయానికి తరలివస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.


