TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భక్తులపై దౌర్జన్యం చేసిన పోలీసులు...

Published on: Mon Oct 14, 2019 4:17PM

 

శ్రీకాకుళం జిల్లాకు దైవ దర్శనం కోసం వచ్చిన తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొంత మంది భక్తులు ఆరోపిస్తున్నారు. హోటల్లో బస చేసిన తమపై దౌర్జన్యం చేశారంటున్నారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు, తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన భాస్కర్ రెడ్డి, వీరరాఘవరెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి అరసవెల్లి సూర్య నారాయణ స్వామి వారి దర్శనానికి వెళ్లారు. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాలను దర్శించుకున్న తర్వాత భాస్కర్ రెడ్డి, వీరరాఘవరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాకుళంలోని నాగావళి హోటల్ లో దిగారు.

రాత్రి పది గంటల తర్వాత భాస్కర్ రెడ్డి, వీరరాఘవరెడ్డి హోటల్ పార్కింగ్ ఏరియాలో ఉన్న తమ కారు దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో జనరల్ చెకింగ్ లో భాగంగా సీఐ శంకర్ తో పాటు ఆరుగురు పోలీసులు హోటల్ దగ్గరకొచ్చారు. రిసెప్షన్ లో హోటల్ లో బస చేస్తున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడే సీఐ శంకర్ బయటకొచ్చిన తమపై దౌర్జన్యం చేశారని భాస్కర్ రెడ్డి, వీరరాఘవరెడ్డి ఆరోపిస్తున్నారు. ఏ తప్పు చేయక పోయినా సిఐ తమపై అనవసరంగా దౌర్జన్యం చేశారని భాస్కర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

తమ దగ్గర నుంచి సెల్ ఫోన్ లు, ఐడీ కార్డులు కూడా లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వారిని పోలీసులు తీసుకెళ్తున్నారని అడ్డుకుంటే మహిళలు అని కూడా చూడకుండా పరుగులు పెట్టించారని భాస్కర్ రెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే వీరరాఘవరెడ్డి, భాస్కర్ రెడ్డి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ఉంటే ప్రశ్నించామే తప్ప వారిపై దౌర్జన్యం చేయలేదని పోలీసులంటున్నారు.