విగ్రహాల ధ్వంసం కేసులో పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి అరెస్ట్.. పోలీసులపై బౌన్సర్ల దాడి 

ఏపీలో హిందూ దేవాలయాలపై వరుస దాడుల ఘటనలు తీవ్ర దుమారానికి.. ఉద్రిక్తతలకు దారి తీస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో "రాష్ట్రంలోని వందలాది ఆలయాలపై దాడులు నేనే చేశాను. దేవతల విగ్రహాల తలలు తొలగించాను. పలు దేవతా విగ్రహాల భాగాలను ధ్వంసం చేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మరి కొందరు పాస్టర్లతో పలుచోట్ల ఇలాంటి దాడులు చేయించాను. దేవుళ్ల విగ్రహాలు ఫేక్‌. నా అసోసియేషన్‌లో 3,642 మంది ఫాస్టర్లు ఉన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 699 గ్రామాలను పూర్తిగా క్రైస్తవ గ్రామాలుగా మార్చివేశాము. త్వరలో మరి కొన్ని గ్రామాలను కూడా ఇలాగే చేస్తాం" అంటూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు ప్రవీణ్‌ చక్రవర్తి (పాస్టర్‌ చక్రవర్తి) చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. బెంగళూరు గాసిప్‌ అనే యూట్యూబ్‌ చానల్‌లో ఆయన గత కొంతకాలంగా హిందూ మతానికి వ్యతిరేకంగా వాఖ్యలు చేస్తున్నారు.

 

పాస్టర్ ప్రవీణ్ ఆస్తుల చిట్టా చూసిన పోలీసులు గుడ్లు తేలేసినట్లుగా అయింది. 35 ఏళ్ల లోపే ఉన్న ఈ పాస్టర్ చక్రవర్తి దిగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చాడు. అయితే ప్రస్తుతం అతని ఆస్తుల విలువ దాదాపుగా రూ. వెయ్యి కోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే అతనికి మాత్రం ఎటువంటి వ్యాపారాలు లేవు. అతడికి ఉన్న వ్యాపారం మొత్తం మత మార్పిళ్లు చేసి.. విదేశాల నుంచి నిధులు రాబట్టుకోవడమే. అంతేకాకుండా ఈ ఏడాది జనవరి 11న అమెరికాలోని ఒక క్రైస్తవ విరాళాలు ఇచ్చే దాతతో ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ దేవుడి విగ్రహాలు అంతా ఫేక్‌... ఎన్నో విగ్రహాలు నా చేతులతో ధ్వంసం చేశాను అంటూ అయన స్వయంగా వెల్లడించారు. తాజాగా ఈ వీడియోలు ఆడియోలు వైరల్‌ అయ్యాయి. దీంతో గుంటూరుకు చెందిన సింగం వెంకట శ్రీలక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదు మేరకు.. మత విద్వేషాలు రెచ్చగొట్టారనే కారణంతో చక్రవర్తిపైన 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకునే సమయంలో సీఐడీ పోలీసులపై చక్రవర్తి బౌన్సర్లు దాడికి కూడా పాల్పడ్డారు.

 

చక్రవర్తి గత కొన్నేళ్లుగా క్రైస్తవ మత ప్రచారకుడిగా వ్యవహరిస్తున్నారు. విదేశాల నుంచి భారీస్థాయిలో అందుతున్న విరాళాలతో కాకినాడ, సామర్లకోటలో మదర్‌ థెరిస్సా పేరుతో పలు పాఠశాలలు, కేటీసీ చిల్డ్రన్‌ హోం, సిలోన్‌ బ్లైండ్‌ సెంటర్‌(ఎ్‌సబీసీ) నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వాకలపూడిలో శార్వాణి స్కూలును స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సామర్లకోట మండలం ఉండూరులో 15ఎకరాల్లో ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (పీవీఆర్‌ఎం) పేరుతో ఎల్‌కేజీ నుంచి ఇంటర్‌ వరకూ పలు విద్యాసంస్థలు నడుపుతున్నారు. బాలికల కోసం పలు విద్యాసంస్థలు ఏర్పాటు చేసి అనాథలు, నిరుపేదలు, ఇటుక బట్టీల కార్మికులను ఎంపిక చేస్తున్నారు. వీరి చదువు పూర్తైన తరువాత వీరిని క్రైస్తవ మతంలోకి మార్పిడి చేయిస్తున్నట్టు, దీనికోసం విదేశాల నుంచి పెద్దమొత్తంలో నిధులు కూడా గుంజుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అంధుల కోసం ఏర్పాటు చేసిన ఎస్‌బీసీలో అసలు అంధ విద్యార్థులు ఎవరూ లేరని వార్తలు వస్తున్నాయి.

 

ఈ పాస్టర్ ప్రవీణ్ చిట్టా తవ్వుతున్న కొద్దీ కొత్తకొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇతడు తనవద్ద పనిచేసే ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆమెను లోబర్చుకుని చివరికి వదిలివేయడంతో బాధితురాలు అందోళనకు దిగింది. దీనిపై సర్పవరం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో తన రక్షణకు ప్రైవేటు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. 50మందికి పైగా బాడీగార్డులకు ఒక్కొక్కరికి నెలకు రూ.15 నుండి 20 వేల వరకూ చెల్లిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాకినాడ రూరల్‌ నియోజకవర్గానికి చెందిన మంత్రి కన్నబాబుకు తాను అనుచరుడిగా చక్రవర్తి చెప్పుకుంటాడు. పాస్టర్ ప్రవీణ్, బ్రదర్‌ అనిల్‌కు చెందిన మత ప్రచార సంస్థతో సన్నిహితంగా ఉంటారు. ఇతడు ఒక రాష్ట్ర మంత్రితో పాటు, ఒక ఎంపీ, పలువురు వైసిపి నేతలతో సన్నిహితంగా ఉంటాడని వార్తలు వస్తున్నాయి.

 

ఇది ఇలా ఉండగా పాస్టర్ ప్రవీణ్ ను అరెస్ట్ చేసినప్పటి నుండి ఏపీలో పరిస్థితులు మారిపోతున్నాయి. విగ్రహాలపై దాడి ఘటనలో ఎటువంటి రాజకీయకుట్ర లేదని రెండు రోజుల క్రితం ప్రకటించిన డీజీపీ.. మళ్ళీ మాట మార్చి… టీడీపీ, బీజేపీ నేతలపై కేసులు నమోదయ్యాయని ప్రకటించారు. అయితే ఈ కేసులలో ఎక్కువగా సోషల్ మీడియా ప్రచారాల గురించే ఉన్నాయి. దీంతో పాస్టర్ ప్రవీణ్ వ్యవహారం ఏమాత్రం హైలెట్ కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.