పోలవరం ప్రాజెక్టుపై పెట్టిన రివర్స్ టెండరింగ్ రివర్స్ అవనుందా..?

పోలవరం ప్రాజెక్టుపై జగన్ ప్రభుత్వం తల పెట్టిన టెండర్లు రివర్స్ కొట్టే అవకాశముందని జల వనరుల నిపుణులు అంటున్నారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు హెడ్ వర్క్స్ లోని మిగిలిన కాంక్రీటు పనులు, జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఒక ప్యాకేజి కింద 4987.55 కోట్లతో పిలిచిన రివర్స్ టెండర్లకు ఒకటే టెండరు రావడం దీనికి తార్కాణం అని చెబుతున్నారు. సాగునీటి ప్రాజెక్టు లోని అరవై ఐదు ప్యాకేజీ పనులకు పిలిచిన రివర్స్ టెండర్లను ఆరు సంస్థలు పాల్గొని బిడ్ లు దాఖలు చేయటం, 15.6 శాతం తక్కువకు టెండర్ వేయటంతో రివర్స్ టెండరింగ్ విజయవంతమైందని మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రకటనలు గుప్పించారు.

దేశంలోనే తొలి సారిగా ఈ విధానానికి వెళ్లే యాభై ఎనిమిది కోట్లు ఆదా చేస్తామన్నారు. కానీ ఆ సంతోషం ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆవిరైంది. పోలవరంలో రెండు పనులకు కలిపి పిలిచిన రివర్స్ టెండర్లలో ఒకే ఒక్క బిడ్ దాఖలైంది. మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రా లిమిటెడ్ ఒకటే బిడ్ వేసింది. జలవనరుల శాఖ ఇచ్చిన జీవో 67 ప్రకారం రివర్స్ టెండరింగ్ లో కనీసం రెండు సంస్థలైనా పాల్గొనాలి, కాని ఒక్క సంస్థే టెండర్ వేయడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ శాఖ మల్లగుల్లాలు పడుతోంది. పోలవరం కాంక్రీట్, జల విద్యుత్ కేంద్రం పటంలో ఒకే ప్యాకేజీగా గత నెల పదిహేడవ తేదిన రివర్స్ టెండర్ విధానంలో జల వనరుల శాఖ టెండర్లను ఆహ్వానించింది.
దానికి ముందు రోజే రివర్స్ టెండరింగ్ లో అనుసరించాల్సిన మార్గ దర్శకాలను వివరిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ జీవో 67 జారీ చేశారు, ఇప్పుడు ఆ మార్గదర్శకాలే ప్రతిబంధకంగా మారాయి. ఈ ఉత్తర్వును గత ప్రభుత్వం విడుదల చేసుంటే అందులోని లోపాలు సరిచేసేందుకే రివర్స్ బిడ్డింగ్ లో ముందుకు వెళుతున్నామని జగన్ సర్కార్ చెప్పేది. కానీ, గత నెల పదహారున తానిచ్చిన ఉత్తర్వు తాజాగా ప్రధాన సమస్యగా మారింది.

అందులో పేర్కొన్న ప్రకారం రివర్స్ టెండర్ కు వెళ్లాలంటే ఖచ్చితంగా రెండు సంస్థలైనా బిడ్ లు దాఖలు చేయాలి అలాగైతేనే ఒక సంస్థ ఎల్ వన్ గా నిలిస్తే మరో సంస్థతో సంప్రదింపులకు వీలుంటుందని ఉత్తర్వు స్పష్టం చేస్తోంది. పోనీ దీన్ని రివర్స్ టెండర్ అని కాకుండా రీటెండర్ గా భావిద్దాం అన్న నిబంధనలు అంగీకరించవని నిపుణులు కూడా చెబుతున్నారు. జల విద్యుత్ కేంద్ర పనుల నుంచి తమను తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ నవయుగ సంస్థ హైకోర్టులో గతంలోనే వ్యాజ్యం వేసింది. ఏపీజెన్కో తీసుకున్న ప్రీ క్లోజరు నిర్ణయంపై కోర్టు స్టే విధించింది. స్టేను ఎత్తి వేయాలని జెన్ కో వేసిన పిటిషన్ పై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరగనుంది. మరోవైపు సోమవారం ఉదయం పదకొండు గంటలకు రివర్స్ టెండర్ లో ఫైనాన్షియల్ బిడ్ ను జల వనరుల శాఖ తెరవనుంది.