పోలవరంలో తప్పులు లేవు... ప్రతిపక్షాలు నోరుమూసుకోవాల్సిందే...

 

పోలవరం తెలుగు ప్రజల జీవనధార అని.. పోలవరం నిర్మించడం నా జీవిత లక్ష్యం... అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందు దొరికినప్పుడల్లా చెబుతూనే ఉంటారు. మరోపక్క ప్రతిపక్షపార్టీ నేతలేమో పోలవరం ప్రాజెక్ట్ పెద్ద ఫ్రాడ్ అని.. ఈ ప్రాజెక్ట్ లో ఎన్నో అవినీతులు జరిగాయని వారికి టైం చిక్కినప్పుడల్లా ఊదరగొట్టేస్తుంటారు. దీనికి తోడు ఈమధ్య నాలుగేళ్లు వారితో కలిసున్న పవన్ కూడా పోలవరం పై అభ్యంతరాలు వ్యక్తం చేయడం.. మీరు ఏ తప్పూ చేయనప్పుడు శ్వేత పత్రం విడుదుల చేయండి అని అనడంతో ఉన్న సందేహాలు కాస్త ఎక్కువయ్యాయనే చెప్పొచ్చు. ఇవన్నీ ఒకటైతే కేంద్రం నుండి నిధుల విషయంలో తలకాయనొప్పులు. ఇలా అన్ని దిక్కుల నుండి విమర్శలు, ఇబ్బందులు వస్తున్నా... చంద్రబాబు మాత్రం ఏదోలా పోలవరాన్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

 

అయితే ఇప్పుడు తాజాగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబుకు కాస్త ఊరట కలిగించే ఘటన చోటుచేసుకుంది. పోలవరం ప్రాజెక్టు పనుల తీరుపై కేంద్ర ప్రభుత్వం 2017లో మసూద్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆకమిటీ నివేదిక పూర్తయింది. పోలవరం ఆర్అండ్ఆర్ పై సంతృప్తి వ్యక్తం చేసింది. ఇక ఈ నివేదికలో... నవయుగ కంపెనీ రంగంలోకి వచ్చాక పోలవరం పనులు వేగవంతమయ్యాయని... రోజుకు 4,800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరుగుతున్నాయని మసూద్ కమిటీ తన నివేదికలో తెలిపింది. అంతేకాదు తమ నివేదికలో అనుకున్న లక్ష్యాన్ని అనుగుణంగా పోలవరం పనులు జరుగుతున్నాయని.. కాంక్రీట్ పనుల్లో కూడా చాలా నాణ్యత కనిపిస్తోందని తెలిపింది. నవయుగ కంపెనీ అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా చేరుతుందని అన్నారు. ఏది ఏమైనా పోలవరంపై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ నివేదిక రావడం నిజంగా చంద్రబాబుకు ఊరట నిచ్చే అంశమే. మొత్తానికి ఈ నివేదిక వల్ల  ఇప్పటివరకూ అవాకులు చవాకులు పేల్చిన నేతలందరూ ఇకపై నోరు మూసుకోవాల్సిందే.