గిల్లుతుంటే నవ్వుతున్నారు.. నష్టం తెలిస్తే కదా..!

ఒక పెద్ద కుటుంబంలో ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య మనస్పర్థలు వచ్చాయే అనుకోండి.. మధ్యలో మూడో వ్యక్తి ఆ ఫ్యామిలీకి నష్టం కలిగిలా ప్రయత్నిస్తే ఈ ఇద్దరు చూస్తూ ఊరుకుంటారా..? ఖచ్చితంగా ఇద్దరూ ఒక్కటై శత్రువుని తరిమి తరిమి కొడతారు కదా..? మరి ఇదే పరిస్థితి ఒక రాష్ట్రానికి ఎదురైతే ఎలా స్పందించాలి. అక్కడి జనానికి ప్రాతినిథ్యం వహిస్తున్న వారంతా ఒక్కటవ్వుతారు కదా..? ప్రాజెక్ట్‌లు, ప్రతిష్టాత్మక సంస్థలు ఇలా ఏదైనా సరే తమ రాష్ట్ర ప్రజలకు లాభం కలుగజేస్తుంది అనుకుంటే పార్టీలు వేరైనా అందరూ ఒక్కటై పోట్లాడి.. అవసరమైతే కొట్లాడి సాధించుకొస్తారు. 

 

ఎక్కడి దాకో ఎందుకు మన పక్కనే ఉన్న తమిళనాడునే తీసుకోండి. వాళ్లలో వాళ్లకి ఎన్ని వైరాలు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చే సరికి మేమంతా తమిళులమే అని చాటి చెబుతారు. కావేరి నదీ జలాలు కానీ, శ్రీలంకలో తమిళుల ఊచకోత కానీ, జల్లికట్టు కానీ ఏదైనా సరే పోరాడి సాధించుకుంటారు. అయితే ఇంతటి ఐకమత్యం ఆంధ్రప్రదేశ్‌లో ఉండదు. ప్రతి దానిలో రాజకీయ ప్రయోజనాలు చూసుకునే మన ఘనత వహించుకునే రాజకీయ నాయకులు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంటారు. ఎగువ రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్ట్‌లకు చుక్కునీరు చేరలేదు, అడుగంటిని శ్రీశైలం, నాగార్జున సాగర్.. మోకాళ్ల లోతు నీటితో పులిచింతల.. వ్యవసాయం సంగతి దేవుడెరుగు కనీసం తాగడానికైనా నీళ్లు దొరుకుతాయా అంటూ ప్రజలు ఆకాశం వంక చూస్తోన్న సమయంలో.. మండు వేసవిలోనూ వ్యవసాయానికి నీరు అందించారు చంద్రబాబు. ఇవన్నీ సాధ్యం అయ్యింది పట్టిసీమ వలనే. 

 

కృష్ణా, గోదావరికి ఒకేసారి వరదలు వస్తాయి.. దారి మళ్లించిన నీటిని ఎక్కడ నిలవ చేస్తారు అంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు. అయినా అన్నింటికి సమాధానం పట్టిసీమ ఫలితం ద్వారా తెలియజేశారు ముఖ్యమంత్రి. ఇక తన తదుపరి లక్ష్యంగా పోలవరాన్ని ఎంచుకున్నారు చంద్రబాబు.. సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి విస్తృత ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 70 ఏళ్ల నుంచి కాగితాలకే పరిమితమైంది. ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారుతుందని తెలుసు. అయినా కార్యరూపం దాల్చడానికి ఇన్నేళ్లు పట్టింది. ఇంతటి ప్రాధాన్యమున్న పోలవరాన్ని పూర్తి చేయడానికి పట్టుదల, కార్యదీక్షతో ముందుకు కదిలారు. జాతీయ హోదా, నిధులు, నిర్వాసితులకు నిధులు, ముంపు మండలాల విలీనం ఇలా ప్రతీ అడ్డంకిని దాటుకుంటూ పనులను పరుగులు పెట్టించారు. 

 

ప్రతి సోమవారం పోలవరం వర్చువల్ విజిట్‌ను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అనుకున్న సమయానికన్నా ముందుగానే నిర్మాణం పూర్తవుతుందనుకున్న సమయంలో బ్రేక్ పడింది. పోలవరం స్పిల్‌వే పనుల టెండర్లు ఆపాలని ఆదేశిస్తూ కేంద్రప్రభుత్వం లేఖ రాసింది. ఎంతో వేగంగా పనులు జరుగుతున్న ఈ దశలో కేంద్రం నుంచి వచ్చిన లేఖ లేనిపోని గందరగోళం సృష్టిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నో వ్యయప్రయాసలు పడి పోలవరాన్ని ఈ స్థితికి తీసుకొచ్చామని.. ఆరు నెలల పాటు ప్రాజెక్ట్ జోలికి వెళ్లకపోతే చాలా నష్టం, నిర్మాణ వ్యయం పెరుగుతుంది. పనుల కోసం పెద్ద ఎత్తున యంత్రాలు, కార్మికులు, ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నామని.. ఇప్పుడు ఈ పనులన్నీ ఆగిపోతే వారంతా వెనక్కి వెళ్లిపోతారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 

 

ఇంతటి సంకట స్థితిలో ముఖ్యమంత్రికి అండగా నిలవాల్సింది పోయి.. పోలవరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని అందుకే పనులు నిలిపివేయమని ఆదేశించిందని ప్రధాన ప్రతిపక్షం వ్యాఖ్యానించింది. ఇక కేంద్రంలోని అధికార పార్టీకి చెందిన రాష్ట్ర నేతల సంగతి సరే సరి. ఢిల్లీ పెద్దల దృష్టిలో పడేందుకు ఎప్పుడు పాకులాడే ఈ నాయకులు.. వాస్తవాలు తెలిసి కూడా చంద్రబాబును విమర్శిస్తున్నారు. నిజంగా రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించే వారైతే కేంద్రాన్ని నిలదీసి.. అవసరమైతే పోరాడి పోలవరం పనులను ఆగకుండా చేయాలి కానీ. పట్టుదలతో పని చేస్తున్న వ్యక్తిపై బురద జల్లడం మంచిది కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.