స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక

 

తెలంగాణ రెండవ శాసనసభ స్పీకర్‌గా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ప్రకటించారు. అనంతరం సీఎం కేసీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, అహ్మద్‌ బలాలా తదితరులు వెంట రాగా పోచారం స్పీకర్‌ కుర్చీలో ఆశీనులయ్యారు. ఆ తర్వాత ప్రొటెం స్పీకర్‌ నుంచి పోచారం బాధ్యతలు స్వీకరించారు. గురువారం మధ్యాహ్నం శాసనసభలో పోచారం నామినేషన్‌ దాఖలు చేశారు. శాసనసభా కార్యదర్శి నర్సింహాచార్యులుకు ఆరు సెట్ల నామినేషన్‌ను అందజేశారు. సాయంత్రం 5 గంటల వరకు నిర్ణీత గడువులోగా ఆయన ఒక్క నామినేషన్‌ మాత్రమే దాఖలైంది. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

స్పీకర్‌గా పోచారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు. పోచారం రాజకీయ ప్రస్థానంలో వ్యవసాయశాఖ నిర్వహించడం ఉజ్వలమైన ఘట్టంగా ఆయన పేర్కొన్నారు. పోచారం హయాంలోనే రైతుబంధు, రైతుబీమా పథకాలు వచ్చాయని.. కేబినెట్‌లో ఆయన లేకపోవడం ఒక విధంగా తనకు లోటేనని చెప్పారు. పోచారం స్థానంలో సమర్థుడికి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనూ పోచారం పోరాడారని గుర్తు చేశారు. వివాద రహితుడిగా ఆయనకు మంచి పేరుందని, భగవంతుడు పరిపూర్ణమైన ఆరోగ్యం, ఆయుష్షును ఆయనకు ఇవ్వాలని ఆకాంక్షించారు. స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించిన ప్రతిపక్ష సభ్యులకు కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.