ఎమ్మెల్యేలు పోచారం మాట వింటారా?

 

తెలంగాణ రాష్ట్ర రెండొవ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. పోచారం స్పీకర్ చైర్ లో ఆశీనులు కాగా సీఎం కేసీఆర్ సహా ఇతర పార్టీల నేతలు అభినందనలు తెలుపుతూ ప్రసంగించారు. అనంతరం స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సభలో తొలిసారిగా పోచారం ప్రసంగించారు. తెలంగాణ శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్‌, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

శాసనసభాపతి పదవి అత్యంత కీలకమని, సభ నిర్వహణలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, సభకు అంతరాయం కలిగించడం గౌరవప్రదం కాదని.. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సభను నిర్వహించుకుందామని చెప్పారు. ప్రజలకు న్యాయం చేసే క్రమంలో సభ్యులంతా సహకరిస్తారని భావిస్తున్నానన్నారు. సభ్యులందరం కలిసి ఆదర్శ శాసనసభగా తీర్చిదిద్దుదామని పోచారం పిలుపునిచ్చారు. సభ గౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు అంతా కలిసి పనిచేయాలని సూచించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. సభ అంటేనే విమర్శలు, నిరసనలు, వాయిదాలు అన్నట్లుంది ప్రస్తుతం. ఇలాంటి పరిస్థితుల్లో పోచారం చెప్పిన మాట సభ్యులు వింటారో పెడచెవిన పెడతారో?