పీఎన్‌బీకి మరో షాక్

దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో కుంభకోణం వెలుగు చూసిన సంగతి తెలిసింది. ఈ వార్త పీఎన్‌బీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఆ రోజు నుంచి నేటి వరకు స్టాక్ మార్కెట్‌లో పీఎన్‌బీ షేర్లు పడిపోతున్నాయి. తాజాగా ఈ బ్యాంక్‌కు మరో షాక్ తగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రేటింగ్‌ను నెగిటివ్‌లోకి మారుస్తున్నట్లు ఫిచ్, మూడీస్ ప్రకటించాయి. గత కొన్నేళ్లుగా ఈ కుంభకోణం జరుగుతున్నప్పటికీ.. ఎవరూ గుర్తించకపోవడం.. నిర్వహణ పర్యవేక్షణ నాణ్యతా లోపాన్ని ఎత్తిచూపుతుందని ఫిచ్ తెలిపింది. ఈ నేపథ్యంలో పీఎన్‌బీకి బీబీ రేటింగ్‌ను ఇస్తున్నట్లు ఫిచ్ ప్రకటించింది. బ్యాంకు బేస్‌లైన్‌ క్రెడిట్‌ అసెస్‌మెంట్‌(బీసీఏ), అడ్జస్టెడ్‌ బీసీఏ బీఏ3గా, కౌంటర్‌పార్టీ రిస్క్‌ అసెస్‌మెంట్‌ రేటింగ్‌ బీఏఏ3(సీఆర్‌)/పీ-3(సీఆర్‌)ను డౌన్‌గ్రేడ్‌ రివ్యూలో ఉంచుతున్నట్టు మరో రేటింగ్ ఏజెన్సీ మూడీస్‌ తెలిపింది.