TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం అయినా, పీఎం అయినా ఒకటే.. జైలు కెడితే పదవి ఊస్ట్.. లోక్ సభలో బిల్లు

Published on: Wed Aug 20, 2025 10:54AM

తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లే ప్రజాప్రతినిధుల పదవులకు చెక్ పెట్టేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు ఎవరైనా సరే  తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే..  వారు ఆటోమేటిగ్గా పదవి కోల్పోతారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లును తీసుకువస్తోంది. ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా  లోక్‌సభలో బుధవారం (ఆగస్టు 20) ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం చట్టాల మేరకు ప్రజా ప్రతినిథి ఎవరైనా కోర్టులో దోషిగా నిరూపితమైతేనే పదవి కోల్పోతారు. అయితే ఇప్పడు కేంద్ర తీసుకువస్తున్న బిల్లు చట్ట రూపం దాల్చితే..  కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసులో అరెస్ట్ అయి, వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే.. 31వ రోజున ఆ ప్రజాప్రతినిథి పదవి ఆటోమేటిగ్గా రద్దౌతుంది.   హత్య, భారీ అవినీతి వంటి   నేరాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

ఈ చట్టం కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 75, 164, 239ఏఏ లకు సవరణలు చేయనున్నారు. గత ఏడాది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి   అరవింద్ కేజ్రీవాల్, దాదాపు ఆరు నెలల పాటు జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిరోధించేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. 

ఈ బిల్లుతో పాటు, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు, జమ్మూకశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ సవరణ  బిల్లును కూడా అమిత్ షా బుధవారం (ఆగస్టు 20) లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.