క్లీన్ ఇండియా కోసం చీపురు పడతానన్న మోడీ
Published on: Wed Sep 24, 2014 12:12PM
.jpg)
దేశాన్ని మురికి నుంచి రక్షించుకోవడానికి అందరూ కృషి చేయాల్సిన అవసరం వుందని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ‘మామ్’ని మార్స్ కక్ష్యలో ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని తిలకించడానికి బెంగుళూరుకు వచ్చిన నరేంద్రమోడీని స్థానిక విమానాశ్రయ ఆవరణలో స్థానిక బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ, ‘‘గాంధీ జయంతి నుంచి స్వచ్ఛమైన భారత్ అనే ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాను. ఈమధ్య జపాన్కి వెళ్ళినప్పుడు అక్కడి రోడ్లు అద్దాల్లా మెరిసిపోతూ వుండటం గమనించాను. ఎక్కడా చెత్త అనేదే కనిపించలేదు. మన దేశాన్ని కూడా అలా ఎందుకు మార్చుకోలేం అనిపించింది. అందుకే మనం మన దేశాన్ని మురికి నుంచి కాపాడుకోవడానికి చేతులు కలపాలి. దేశంలో అందరూ వారానికి రెండు గంటలను మురికిని వదిలించడానికి కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్న నమ్మకం నాకుంది. ఈ ‘క్లీన్ ఇండియా’ కార్యక్రమంలో నేను కూడా పాల్గొని చీపురు పడతాను. దేశాన్ని చెత్త రహిత సుందర భూమిగా మార్చుకోవాలన్న సంకల్పం అందరిలోనూ కలగాలి. మన దేశాన్ని పరిశుభ్రంగా వుంచుకోవాలా వద్దా అనేది అందరూ ఆలోచించుకోవాలి’’ అని అన్నారు.


