అచ్చ తెలుగులో అదరగొట్టిన మోదీ

 

గుంటూరు శివారు ఏటుకూరులో జరుగుతున్న ప్రజాచైతన్య సభలో పాల్గొన్న ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. ఈ సభలో తొలుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మాట్లాడుతూ మోదీని ప్రశంసించారు. 2014 తర్వాత మోదీ ఆంధ్రరాష్ట్రానికి ప్రాజెక్టులు, గ్రాంట్స్, సంక్షేమకార్యక్రమాల రూపంలో చేసిన మేలు మరచిపోలేనిదని కన్నా కొనియాడారు. చారిత్రాత్మకమైన పోలవరం నిర్మాణానికి వంద శాతం నిధులు ఇచ్చి రాష్ట్రానికి ఇచ్చిన గిఫ్ట్‌ను మరిచిపోలేమని అన్నారు. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, రూ. 500 కోట్లతో విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి, రెండు ఫ్లైఓవర్లు, ఎయిమ్స్ ప్రాజెక్టు, ఔటర్ రింగ్ రోడ్డుకు నిధులు ఇవ్వడం.. ఇలా చెప్పుకుంటు పోతే రాష్ట్రానికి మోదీ చాలా చేశారని ఆయన కొనియాడారు.

కన్నా లక్ష్మినారాయణ మాట్లాడిన అనంతరం మైకు ముందుకు వచ్చిన ప్రధాని మోదీ ప్రసంగం మొదట్లో కొన్ని వాక్యాలను తెలుగులో మాట్లాడారు. ‘అక్షర క్రమంలోనే కాదు.. అన్ని రంగాల్లో, అంశాల్లో అగ్రగాములుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు. పద్మభూషణ్‌, దళిత రత్నం, కవి కోకిల గుర్రం జాషువా జన్మించిన గుంటూరు జిల్లా ప్రజలకు నమస్కారం. మహా కవి తిక్కన్న జన్మించిన గుంటూరు ప్రజలకు నమస్కారం.’ అని అన్నారు. అనంతరం ఆయన తన ప్రసంగాన్ని హిందీలో కొనసాగించారు. అంతకు ముందు ఆయన విశాఖలో రూ.1178 కోట్లతో నిర్మించిన వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. కృష్ణపట్నం పోర్టు వద్ద రూ.700 కోట్లతో నిర్మించిన బీపీసీఎల్‌ టర్మినల్‌ శంకుస్థాపన చేశారు. అమలాపురం వద్ద ఓఎన్‌జీసీ వశిష్ట, ఎస్1 ఆన్‌షోర్‌ ప్రాజెక్టును రిమోట్‌ ద్వారా ప్రారంభించారు.