రేపు అయోధ్య‌లో మోదీ షెడ్యూల్ ఇదే.. ఓ వైపు భక్తి, మరోవైపు ఉగ్రముప్పు!!

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రేపు భూమిపూజ జరగనుంది. ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతుండగా.. విశిష్ట అతిథిగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరవుతున్నారు. వేదికపై వీరిద్దరితో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి‌, అయోధ్య టెంపుల్ ట్రస్ట్ ఛైర్మన్ మాత్రమే ఆసీనులు కానున్నారు.

మరోవైపు ఉగ్రవాదులు దాడికి తెగబడే అవకాశాలు ఉన్నాయన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేప‌థ్యంలో భ‌ద్ర‌త‌ను మ‌రింత ప‌టిష్టం చేశారు. ఇప్పటికే అయోధ్య మొత్తం ఎస్పీజీ భద్రతాబలగాల చేతుల్లోకి వెళ్లిపోయింది. అయోధ్య నగరంలోకి ప్రవేశించే సరిహద్దులను మూసేశారు. బయటి నుంచి నగరంలోకి వచ్చే వారిపై పూర్తి స్థాయిలో నిషేధం విధించారు. స్థానికులు కూడా ఐడీ కార్డు లేకుండా బయటకు రావొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. 

ఇక ప్రధాని మోదీ షెడ్యూల్ విషయానికి వస్తే... రేపు ఉదయం 10.35 గంట‌లకు ప్రత్యేక విమానం ద్వారా ఆయన ఢిల్లీ నుంచి లక్నోకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి 125 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు ప్రత్యేక హెలికాప్టర్ లో వెళతారు. అయోధ్య‌లో ఉద‌యం 11.30 గంట‌ల‌కు మోదీ ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో ల్యాండ్ అవుతారు. అయోధ్య‌లో రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్య‌క్ర‌మానికి ముందు ప్ర‌ధాని అక్క‌డి హ‌నుమాన్ ఆల‌యాన్ని ద‌ర్శించుకుంటారు. త‌రువాత భూమిపూజ‌కు వెళ్తారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు రామ్ ల‌ల్లా ‌ను ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేస్తారు. మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు భూమి పూజ జ‌రుగుతుంది. 12.40 గంట‌ల‌కు అయోధ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాప‌న చేస్తారు.