చట్టసభల్లో రభస ఎవరికి నష్టం.... !?

లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల శాసనసభల్లో కార్యకలాపాలను అడ్డుకుంటే ఎవరికి లాభం...!? ఎవరికి నష్టం....!? ఈ విషయంపై దేశానికే తీవ్ర నష్టమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన చెందారు. పార్లమెంటు సెంట్రల్ హలులో జరిగిన ఉత్తమ పార్లమెంటేరియన్ల అవార్డుల కార్యక్రమంలో పార్లమెంటులో సమావేశాలు జరుగుతున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేసారు. ఉభయ సభలలోను జరుగుతున్న గందరగోళంపై ఆవేదన వ్యక్తం చేసారు. సభలు ఇలా జరిగితే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. దేశంలో నెలకొన్న వివిధ సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలకు నివారణ చర్యలు తీసుకోవాల్సిన చట్టసభలలోనే ఈ గందరగోళాలపై ఆవేదన వ్యక్తం చేసారు. చట్టాలు చేయాల్సిన, వాటిని అమలు పర్చాల్సిన చట్టసభలు ఇలా ఉంటే ఎలా అని మదన పడ్డారు.

 

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన, ఆందోళన, విచారం నిర్వేదన వాస్తవమే. కీలక సమయాలలో లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ్యుల ప్రవర్తన ప్రశ్నించాల్సిందే. అయితే వారందరు ఎక్కడి నుంచి వచ్చారు? వారి వారి రాజకీయ పార్టీలు ఏ దేశానికి చెందినవి.  ఆ ప్రజాప్రతినిధులు ఏ దేశ ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు అన్నదే ఇక్కడ ప్రధానాంశం. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు దేశంలో ఏ రాజకీయ పార్టీ చూసినా సగటు భారతీయుడు తలదించుకోవడమే తప్ప, గర్వపడే అంశం ఏదీ లేకుండా పోయింది. వారి వారి స్వప్రయోజనాలు, పార్టీల ప్రయోజనాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్న ప్రజాప్రతినిధులు సభలో ప్రవర్తిస్తున్న తీరు నిజంగా గర్హనీయం. సభ తీరుపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతోనే,  ఆయన కనుసన్నల్లోని పార్టీల ప్రతినిధులు సభలో గందరగోళం రేపుతున్నారు. చీటికీ మాటికీ సభలోని వెల్‌లోకి ప్రవేశించి సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు.

 

 

దీనిని ఏ విధంగా చూడాలి. సభలో ఈ ప్రవర్తనను ఎలా పరిగణించాలి. లోక్‌సభ, రాజ్యసభతో పాటు వివిధ రాష్ట్రాల శాసనసభలలో కూడా అధికార, ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన ఇలాగే ఉంటోంది. వివిధ రాష్ట్రాలలో జరిగిన, జరుగుతున్న పరిణామాలను చూస్తే " వీళ్లా మన ప్రతినిధులు" అని వారికి ఓటేసిన ప్రజలు బాధపడే స్థితి వచ్చింది. దీనికి కారణం జాతీయ, ప్రాంతీయ పార్టీలు కాదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నవారి తప్పులను ఎత్తి చూపాలి. అధికార పార్టీ అప్పటి వరకు తాము ఏం చేసామో సభల సాక్షిగా ప్రజలకు వివరించాలి. అలాగే ప్రతిపక్షాలు ఎత్తి చూపే అంశాలపై సానుకూలంగా స్పందించాలి. దేశ చట్టసభలలో గడచిన కొంత కాలంగా ఇవేవీ జరగడంలేదు. దీనికి కారణం ప్రజాప్రతినిధులదా? లేక ప్రజలదా? ప్రతిపక్షాలు తన శాఖపై ప్రశ్నలు సంధించే సమయానికి తాను సభలో లేకపోవాడాన్ని తప్పుగా భావించిన విదేశాలకు చెందిన  మంత్రి ఒకరు తన పదవికి రాజీనామ చేసారని సోషల్ మీడియా ఈ మధ్యనే కోడై కూసింది. అంతటి నైతికత భారత దేశ ప్రజాప్రతినిధులకు ఉంటుందా అన్నదే పెద్ద ప్రశ్న. ఎక్కడో ఓ రైలు ప్రమాదంలో ప్రయాణీకులు మరణిస్తే తన పదవికి రాజనామా చేసిన గొప్ప నాయకులు ఇప్పుడు మనకి ఉన్నారా? గొంగళిలో వెంట్రుకులు ఏరుకుంటున్న ప్రస్తుత భారతదేశంలో చర్చలకు, ప్రజాసంక్షేమానికి, ప్రజల బాగోగులకు బాధ్యత వహించే నాయకులు కనబడతారా? ఇవేవీ తన పార్టీలోనే లేనప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేయడం నాటకీయ పరిణామంగానే పరిగణించాలి.

 

 

సభల్లో గందగోళం ఏర్పడడానికి... లేదూ అలా చేయడానికి తెలుగు రాష్ట్రాలు ముందంజలోనే ఉంటాయి. దీనికి తాజా ఉదాహరణ... తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ సభ్యులిద్దరి ప్రవర్తన. ఓ అంశంపై నిరసన తెలియజేస్తున్న సమయంలో ఆ ఇద్దరు సభ్యలు స్పీకర్‌పైకి మైకుని విసిరిన తీరు తెలంగాణ సమాజం తలదించుకోనేలా చేసింది. తామ కావాలని స్పీకర్‌పైకి మైకు విసరలేదని, అది అలా జరిగిపోయిందని వారి వాదన. దీనికి ప్రభుత్వం స్పందించిన తీరు కూడా మరీ ఎక్కువగా ఉంది. ఆ సభ్యులను ఏకంగా వారి పదవీ కాలమంతా సస్పెండ్ చేశారు. రెండు నియోజకవర్గాల ప్రజలు ఎన్నుకున్న సభ్యుల్ని ఇలా పూర్తిగా సభ నుంచి వెలి వేయడం ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించడం కాదా...!? ఈ అంశంపై కోర్టు చివాట్లు పెట్టే వరకూ ప్రభుత్వం వెళ్లిందంటే ఏలికలకు ప్రజాస్వామ్యం పట్లా.. న్యాయస్ధానం పట్ల ఎంతటి గౌరవం ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి సంఘటనలకు ఒక్క తెలంగాణ మాత్రమే పరిమితం కాదు.... తమిళనాడు... కర్నాటక... ఉత్తరాది రాష్ట్రాలలోనూ ప్రతి శాసనసభలోనూ జరుగుతున్నది. ముందు అధికార పక్షంలో ఉన్న సంయమనం పాటించడం నేర్చుకుంటే ఆ తర్వాత ప్రతిపక్షాలు వారి దారిలోకి వస్తాయి. అడ్డదారిలో బిల్లులకు ఆమోదం తెలపడం... తద్వారా తమ అధికారాన్ని ప్రదర్శించడం వంటివి మానుకుంటే సభలు ప్రశాంతంగా... సవ్యంగా.... ఆదర్శప్రాయంగా జరుగుతాయి. లేకపోతే ఇదిగో ఇలాగే బాధ పడడమే మిగులుతుంది. అధికార దర్పం కోసం వివిధ రాజకీయ పార్టీలు సభల్లో ప్రవర్తిస్తున్న తీరును మార్చుకోవాలి. మార్చుకోకపోతే వారు ఎలా మారాలో ప్రజలే చెబుతారు. వారి చేతిలో వీరిని మార్చే బ్రహ్మస్త్రం ఓటు ఉంది. అదొక్కటి చాలు.... రాజకీయ నేతల్ని మార్చడానికి....