చంద్రబాబుకి మోదీ విషెష్.. భవిష్యత్తు అవసరాలే కారణమా?

 

ఏపీ సీఎం చంద్రబాబు 69 వసంతాలు పూర్తి చేసుకొని 70 వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలా పలువురు తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతలు ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకి విషెష్ తెలిపారు. ప్రాంతీయ నేతలు రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నప్పటికీ.. కలిసినప్పుడు నవ్వుతూ పలకరించుకోవడం, శుభ సందర్భాల్లో విషెష్ తెలుపుకోవడం చూస్తూనే ఉంటాం. అందుకే.. జగన్, కేటీఆర్ వంటి వారు చంద్రబాబుకి విషెష్ చెప్తే కొత్తగా ఏం అనిపించలేదు. అయితే ఇప్పుడు ఒకరు చంద్రబాబుకి విషెష్ చెప్పడం మాత్రం పెద్ద చర్చనీయాంశమైంది. ఆయనే ప్రధాని మోదీ.

మోదీ ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు విషెష్ తెలిపారు. ఆయురారోగ్యాలతో చిరకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. ఒకవైపు సార్వత్రిక ఎన్నికల హడావుడితో మోదీ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఒక సీఎం బర్త్ డే అని తెలుసుకొని విష్ చేయడమంటే ఆలోచించాల్సిన విషయమే. అదికూడా తనని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తనకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పలు పార్టీలను ఒకే వేదికపైకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు వంటి నేతను విష్ చేయడం ఆశ్చర్యమే. బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందంటూ పోరాటం స్టార్ట్ చేసిన చంద్రబాబు.. తరువాతర్వాత బీజేపీ దేశంలోని వ్యవస్థలను నాశనం చేస్తుందంటూ.. మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలకు ఒకే వేదిక పైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓ రకంగా చంద్రబాబు మోదీని వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో పెద్ద యుద్ధమే చేస్తున్నారు. అలాంటి చంద్రబాబుకి క్షణం కూడా తీరిక లేని సమయంలో మోదీ విష్ చేశారు.

అయితే మోదీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబుని విష్ చేసుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బీజేపీకి కానీ కాంగ్రెస్ కి కానీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అన్ని సీట్లు వచ్చే అవకాశం లేదు. జాతీయ పార్టీలు ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అందుకే మోదీ చంద్రబాబుని విష్ చేసి తమ పాత మిత్రుత్వాన్ని గుర్తుచేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ సీట్లు తక్కువైతే చంద్రబాబుని మళ్ళీ ఎన్డీయేలోకి ఆహ్వానించే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. చూద్దాం మరి వీళ్ళ బంధం మళ్ళీ చిగురిస్తుందో? లేదో?.