పుల్వామా ఉగ్రదాడి తరువాత.. షూటింగ్ లో మోదీ ఫుల్ బిజీ

 

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని బీజేపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్‌ ఆధారిత ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పే విషయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు చెప్పినట్లు మేము మన భద్రతా బలగాలకు మద్దతు తెలుపుతున్నాం. అలాగే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా మద్దతు తెలుపుతున్నాం. కానీ, మోదీ ప్రభుత్వం ఈ విషయాన్ని రాజకీయంగా వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. అమిత్‌ షా ఫిబ్రవరి 17న గౌహతిలో పుల్వామా విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. మోదీ-అమిత్‌ షా ఇద్దరూ ఉగ్రవాద విషయాన్ని రాజకీయం చేసే చెడు అలవాటుని అవలంభిస్తున్నారు’ అని ఆరోపించారు. ఓ వైపు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మన ప్రభుత్వం, ఆర్మీ పోరాడుతోంటే మరోవైపు బీజేపీ తమ ప్రయోజనాల కోసం పలు ప్రకటనలు విడుదల చేస్తోంది అని విమర్శించారు.

‘వీర జవాన్లను మోదీ అవమానిస్తున్నారు. ఈ విషయంపై మరెవ్వరూ ప్రదర్శించని తీరుని ఆయన కనబరుస్తున్నారు. పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన రోజున దేశం మొత్తం విచారం వ్యక్తం చేస్తుంటే.. మోదీ మాత్రం ఆ సమయంలో ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కులో ఓ డిస్కవరీ ఛానెల్‌ డాక్యుమెంటరీ షూటింగ్‌లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3.10కి పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. సాయంత్రం 6.45 వరకు మోదీ డాక్యుమెంటరీ షూటింగ్‌లోనే ఉన్నారు. నాలుగు గంటలు ఫొటోలు దిగడంలోనే నిమగ్నమైపోయారు. ప్రపంచంలో ఇలాంటి ప్రధాని ఎవరైనా ఉంటారా?. మోదీ వ్యవహారశైలి గురించి చెప్పడానికి నాకు మాటలు కూడా రావడంలేదు’ అని విమర్శించారు. అలాగే, ఓ జవాను అంత్యక్రియల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌.. ఆ సమయంలో నవ్వుతూ కనిపించారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర మంత్రి అల్ఫోన్స్‌ ఓ జవాను శవపేటికతో సెల్ఫీ తీసుకున్నారని విమర్శించారు.