TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స‌మ‌తామూర్తి సేవ‌లో ప్ర‌ధాని మోదీ.. ముచ్చింత‌ల్‌కు ప్ర‌ముఖుల రాక‌..

Published on: Thu Feb 3, 2022 11:27AM

రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈనెల 14 వరకు జరగనున్న ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి వేలాది భక్తులు హాజరవుతున్నారు. వ్యక్తి కన్నా సమాజ శ్రేయస్సే ముఖ్యమని చాటిన మానవతావాది.. భగవత్‌ ఆరాధనకు కులమతాలు ప్రాతిపదిక కాదన్న సమతామూర్తి రామానుజాచార్యులు. ఆ మహనీయుడి సహస్రాబ్ది వేడుకలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. కీల‌క‌మైన రామానుజాచార్యుల విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం శ‌నివారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా జ‌ర‌గ‌నుంది.

ప్ర‌ధాని మోదీ ఈనెల 5న హైదరాబాద్‌ రానున్నారు. 6 గంటల పాటు నగరంలో గ‌డ‌ప‌నున్నారు. 5వ తేదీన మధ్యాహ్నం 2:10 నిమిషాలకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాక‌.. ప్రధాని మోదీ మొదట ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల‌కు హాజ‌ర‌వుతారు. అనంత‌రం, సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్‌ వస్తారు.

ముచ్చింత‌ల్‌ దివ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే రెండో అతి పెద్దదైన  (కూర్చొని ఉండే ప్రతిమ) శ్రీరామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని ప్ర‌ధాని ఆవిష్కరించనున్నారు. మోదీ మూడు గంటల పాటు అక్క‌డ గడపనున్నారు. దివ్యక్షేత్రం మొత్తం తిరిగి విశిష్టతలు తెలుసుకుంటారు. యాగశాలలు సందర్శిస్తారు. ప్ర‌త్యేక‌ పూజా కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. సాయంత్రం నిర్వహించే  సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాటర్‌ ఫౌంటెయిన్‌, మ్యూజిక్‌ , త్రీడీ షోలతో పాటు  రాత్రివేళ  పంచవర్ణాల్లో మెరిసే సమతామూర్తిని పీఎం మోదీ తిలకిస్తారు. 

రాత్రి 8 గంటలకు ముచ్చింతల్‌ దివ్యక్షేత్రం నుంచి తిరిగి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. ప్రధాని ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆశ్రమంలో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ అధికారులు ముచ్చింతల్‌ దివ్య క్షేతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని వచ్చి.. తిరిగి వెళ్లే వరకు.. ఎస్పీజీ ఆధీనంలోనే సమతామూర్తి ప్రాంగణం ఉంటుంది. 

ప్ర‌ధాని వ‌చ్చి వెళ్లాక‌.. ఈనెల 7న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, 8న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, 13న రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన  సీఎంలు,  విదేశీ ప్రతినిధులు సైతం ముచ్చింత‌ల్‌లోని రామానుజాచార్యుల దివ్య‌క్షేత్రాన్ని సంద‌ర్శిస్తారు.