మాస్క్ లేకుండా తిరిగేస్తున్నారు జాగ్రత్త: మోడీ 

దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సకాలంలో లాక్‌డౌన్ విధించడం వల్ల లక్షలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడగలిగామని ప్రధాని చెప్పారు. కరోనాపై మొదట్లో జాగ్రత్తలు తీసుకున్నట్లు కనపడిన భారతీయులు ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇది ఎంత మాత్రం పనికిరాదని మోదీ హెచ్చరించారు. కరోనా విషయంలో ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని అయన సూచించారు. మాస్కు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పక పాటించాలన్నారు. ఈ సందర్భంగా సాక్షాత్తు ఓ దేశ ప్రధాని మాస్క్ పెట్టుకోలేదని 13 వేల రూపాయల ఫైన్ వేసిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. గ్రామీణుడికైనా, దేశ ప్రధానికైనా నిబంధనలు ఒకేలా ఉండాలని అయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనల విషయంలో కఠినంగా ఉండాలని మోడీ సూచించారు. ప్రస్తుతం మనం కరోనాతో పాటు, అన్ని రకాల వ్యాధులు సంభవించే సీజన్ వైపు పయనిస్తున్నామని, దీంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు.

ఈ సందర్భంగా ప్రధాన్ మంత్రి గరిబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని ఐదు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఇందులో భాగంగా పేదలకు 5 కిలోల ఉచిత గోధుమ లేదా బియ్యం, ఒక కిలో పప్పు దినుసులు ఇస్తున్నట్లు అయన ప్రకటించారు. నవంబర్ వరకు ఈ పథకాన్ని అమలు చేయడానికి 90 వేల కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని ప్రధాని చెప్పారు. ఈ పథకం ప్రారంభంచినప్పటి నుండి నవంబర్ వరకు ఒకటిన్నర లక్షల కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రధాని పేర్కొన్నారు. మరో పక్క పండుగల సమయం కూడా వస్తోందని, ఈసారి అవసరం, ఖర్చులను కూడా పెంచుతుందని ప్రధాని మోదీ అన్నారు.