జగన్ సర్కార్ తీరుతో మోడీ షాక్!
Published on: Sat Feb 13, 2021 2:31PM
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సంచలన ఘటనలు జరిగాయి. ముఖ్యంగా అలయాలపై వరుసగా జరిగిన దాడులు తీవ్ర కలకలం రేపాయి. రాజకీయంగా కాక పుట్టించాయి. నర్సాపురం ఎంపీ రఘురామ రాజ కృష్ణం రాజు శనివారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇద్దరి మధ్య దాదాపు 18 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రధాని మోడీకి వివరించానని చెప్పారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రధాని మోడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు.
ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాలపై సావదానంగా విన్న ప్రధాని ఒక్క విషయంలో మాత్రం ఆశ్చర్యానికి గురయ్యారని ఎంపీ రఘురామ రాజు చెప్పారు. రాష్ట్రంలో చర్చిల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలిచిందని రఘురామ.. మోడీకి తెలిపారు. దీంతో చర్చిల నిర్మాణానికి ప్రభుత్వ టెండర్లా? అని ప్రశ్నిస్తూ.. ఆశ్చర్యానికి గురయ్యారని, ఈ విషయంలో ప్రభుత్వమే టెండర్లు పిలవడం ఎలా సాధ్యమని మోడీ అన్నారని రఘురామ రాజు వెల్లడించారు. చర్చిల టెండర్లకు సంబంధించిన పూర్తీ వివరాలు ఇవ్వాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజును ప్రధాని మోడీ కోరినట్లు తెలుస్తోంది.
మీ చేతులతో శంకుస్థాపన చేసిన అమరావతిని నిలిపివేస్తే పేద రైతులకు అన్యాయం జరుగుతోందని ప్రధాని మోడీకి చెప్పానని తెలిపారు రఘురామ కృష్ణం రాజు. దేవాలయాలపై దాడులు విషయంలో జోక్యం చేసుకోవాలని కోరానన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయొద్దని ప్రధానికి విన్నవించానని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌పై ప్రధాని మోడీ అభయం లభించినట్టుగానే భావిస్తున్నానని చెప్పారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు.


