కేసీఆర్‌కు అపాయింట్మెంట్! బాబుకు డిస్సపాయింట్మెంట్! మోదీ రాజకీయం! 

కేసీఆర్ మరోసారి దిల్లీ ప్లైట్ ఎక్కారు. మోదీతో సహా మరికొందరు కేంద్రమంత్రుల్ని కలుస్తారట! తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కొత్త జోనల్ విధానం కేంద్రం చేత అమోదింపజేయించుకోటానికి ఈ టూర్ అంటున్నారు! ఇదంతా అధికారికమే… అయితే, కేసీఆర్, మోదీల కొత్త స్నేహానికి కూడా ఇది ఒక విధమైన సంకేతమే!

 

 

కేసీఆర్ 2014లో మోదీకి చాలా దూరం. కానీ, ఇప్పుడు ఆయన నమ్మదగ్గ నాయకుల్లో ఒకరైపోయారు. ఒకవైపు చంద్రబాబును దూరం చేసుకున్న మోదీ పార్లమెంట్ సాక్షిగా కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. అంతే కాదు, ఇప్పుడు కేసీఆర్ ఇంచుమించూ నెలకొకసారి దిల్లీకి వెళ్లివస్తున్నారు. పోయిన నెలలో కూడా ఆయన మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన జోనల్ విధానం మోదీ సర్కార్ కూడా ఆమోదించాలని ఆయన కోరుతున్నారు. హైకోర్ట్ విభజన, కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా లాంటి మరి కొన్ని డిమాండ్లు కూడా వున్నాయి. అయితే, ఎన్నికలు దగ్గరపడుతోన్న తరుణంలో జోనల్ విధానంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు.దీనికి మోదీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో స్థానికులకి 95 శాతం ఉద్యోగాలు దక్కుతాయి. ఆ విధంగా రిజర్వేషన్ అమలవుతుంది. ఇది ఎన్నికల్లో కేసీఆర్ కు బలమైన అస్త్రంగా ఉపయోగపడుతుంది!

 

 

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ ఉప్పు, నిప్పే! గులాబీ పార్టీ ఎన్డీఏలో లేదు కాబట్టి రాష్ట్ర నేతలు అడపాదడపా ఆరోపణలు చేస్తూనే వుంటారు. కానీ, కేంద్రం పెద్దలు మాత్రం ఈ మధ్య కాలంలో సంపూర్ణమైన ప్రోత్సాహం ఇస్తున్నారు గులాబీ కారుకి! ఒకప్పుడు మోడీ లేడు గీడీ లేడు, మోడీగాడు… అన్న కేసీఆరే ఇప్పుడు ప్రధాని ఫేవరెట్ సీఎం అయ్యారు. మరీ ముఖ్యంగా, తెలంగాణలో బీజేపీకి నష్టం చేసే నిర్ణయాలు కూడా మోదీ ప్రభుత్వం కేసీఆర్ కోసం తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. జోనల్ విధానం లాంటి విషయాల్లో గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది టీఆర్ఎస్ కు ఓట్లు సంపాదించి పెడుతంది. దీనికి మోదీ లాంటి రాజకీయ నాయకుడు అంగీకరిస్తే .. అది పెద్ద ఆశ్చర్యమే! ఎందుకంటే, కళ్ల ముందే మనకు ఏపీలో ఏం జరుగుతోందో తెలిసిందే కదా!

 

చంద్రబాబుతో 2014లో క్లోజ్ గా మూవ్ అయిన మోదీ ఇప్పుడు పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు. కేసీఆర్ కు, విజయసాయి రెడ్డికి ఇచ్చిన అపాయింట్ మెంట్లలో సగం సార్లు కూడా ఇవ్వటం లేదు. మరో వైపు ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ రైల్వే, కడప ఉక్కు వంటి వాటి మీద మోదీ సర్కార్ కొర్రీలు మనకు తెలియనివి కావు! ఇలా ఒకవైపు ఆంద్రాకు అన్ని అడ్డంకులు సృష్టిస్తూ , తెలంగాణ ముఖ్యమంత్రిని మాత్రం అన్ని విధాల వెన్ను తట్టి ప్రోత్సహించటం ఎలా అర్థం చేసుకోవాలి? నిస్సందేహంగా మోదీ, అమిత్ షా మార్కు రాజకీయంగానే!

చంద్రబాబును టార్గెట్ చేసేందుకు కేసీఆర్ సాయం మోదీ తీసుకుంటున్నారు. మోదీకి సాయం చేసినందుకు కేసీఆర్ తెలంగాణలో తమ పార్టీ బలోపేతం చేసుకుంటున్నారు. ఇదీ గులాబీ బాస్ దిల్లీ టూర్ల వెనుక సారాంశం!