ఒమిక్రాన్ ఉధృతిపై ఏం చేద్దాం? సీఎంలతో పీఎం భేటి.. పండగ అంక్షలపై ఫోకస్!
Published on: Thu Jan 13, 2022 10:03AM
కరోనా పరిస్థితిపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ( గురువారం) సమావేశం అవుతున్నారు. దేశంలో రోజు వారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగతున్న నేపధ్యంలో, పరిస్థితిని ఎదుర్కునేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు సంనద్దతను తెలుసుకోవడంతో పాటుగా,తీసుకోవలసిన చర్యలపై సూచనలు చేస్తారని అధికార వర్గాల సమాచారం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే ఈ సమావేశం సమావేశంలో ప్రధానంగా ఒమిక్రాన్’ ఉదృతి కట్టడికి తీసుకోవలసిన చర్యలపై చర్చించే ఆవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇంతవరకు కొవిడ్ కట్టడికి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలే ఆంక్షలు విధిస్తున్నాయి. ఈమేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అవసరమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై కూడా, అంక్షల నిర్ణయం రాష్ట్రాలకే వదిలివేయడమా లేక కేంద్ర స్థాయిలో ఆంక్షలు విధించవలసిన అవసరం వుందా, అనే విషయాన్ని కూడా ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చిస్తారు.ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించే ఆలోచన ప్రస్తుతానికి కేంద్రానికి లేదని, ఇదుకు సంబంధించి పూర్తి అధికారాలు రాష్ట్రాలకే ఉన్నాయని చెప్పారు. సంక్రాంతి వరకు స్థానిక పరిస్థితులను బట్టి.. రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్, ఆంక్షలు విధించుకోవచ్చని అన్నారు. అయితే పండగ తర్వాత దేశంలోని పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్’ విధించడం సహా ఇతర అంక్షల విషయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అలాగే, వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు, వైద్య సన్నద్ధత వంటి అంశాలపై సమీక్షించనున్నారు. ఒమిక్రాన్ కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కట్టడికి రాష్ట్రాలకు పలు సూచనలు చేయనున్నారు. గత ఆదివారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలోనూ కొవిడ్ పరిస్థితిపై ప్రధాని మోడీ చర్చించారు. జిల్లా స్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచించారు. కరోనాను నిలువరించేందుకు టీకానే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు.
మరోవంక తాజాగా కేంద్ర ప్రభుత్వం కనీసం 48 గంటలు నిల్వ ఉండే మెడికల్ ఆక్సిజన్ ను సరిపడనంతగా సిద్దంగా ఉంచుకోవాలని, ఆక్సిజన్ కంట్రోల్ రూమ్ లకు పున:శక్తి కల్పించాలని సంబంధితశాఖలకు ఆదేశాలివ్వాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ మేరకు లేఖలు రాశారు. ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు దేశంలోని ఆరోగ్యకర్తలు, 60ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు పంపిణీని ఇప్పటికే ప్రారంభించింది కేంద్రం. 15-18 ఏళ్ల పిల్లలకు కూడా టీకాలు అందిస్తోంది.2020లో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. వైరస్ కట్టడికి చర్యలపై చర్చిస్తున్నారు. కాగా, ఈ రోజు జరిగే ముఖ్యమంత్రుల సమావేశంలో కీలక నిర్ణయాలు ఉండవని, పండగ తర్వాతనే అప్పటి పరిస్థితిని బట్టి ఆక్షలు, లాక్ డౌన్ ..ఇతరత్రా నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు.


