జన్ ధన్ యోజన ప్రారంభం

 

దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన జన్ ధన్ యోజన పథకం ప్రారంభమైంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్రమోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా లక్ష్యంగా జన్ ధన్ యోజన ద్వారా పేదలకు ఎన్నో ప్రయోజనాలు వుంటాయని తెలుస్తోంది. ఖాతాదారులకు ఇన్సూరెన్స్‌తోపాటు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తారు. ఈ ఖాతాలు ఆధార్ కార్డుకు అనుసంధానంగా వుంటాయి. జన్ ధన్ యోజనలో భాగంగా పథకం ప్రారంభమైన తొలిరోజే దేశవ్యాప్తంగా కోటి ఖాతాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పథకం ప్రారంభోత్సవంలో దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జన్ ధన్ యోజన పథకం లక్ష్యాలు, ప్రయోజనాలను వివరిస్తూ దేశవ్యాప్తంగా వున్న బ్యాంకు అధికారులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏడున్నర లక్షలకు పైగా ఈ మెయిల్స్ పంపించారు.