సింధుకి ఐస్‌క్రీం.. ఒలింపిక్స్ వీరులకు విందు.. మోదీ అదిరిపోయే ఆతిథ్యం..
Published on: Mon Aug 16, 2021 1:48PM
పీవీ సింధుకు ప్రధాని ఐస్‌క్రీం తినిపించారు. నీరజ్ చోప్రాకు చుర్మా రుచి చూపించారు. ఒలింపిక్స్ పతకదారులను ఆప్యాయంగా పలకరించారు. వారిని ప్రశంషించారు. వారి ప్రతిభను కొనియాడారు. క్రీడాకారులతో కలిసి ఫొటోలు దిగారు. స్వాత్రంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ తన నివాసంలో ఒలింపిక్స్ అథ్లెట్లకు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు.
టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లేముందు అథ్లెట్లతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. పీవీ సింధుకు ఐస్‌క్రీం ఇష్టమని తెలిసి.. పతకం గెలిచి వచ్చాక కలిసి ఐస్‌క్రీం తిందామని స్ఫూర్తినింపారు. ఒలింపిక్స్‌లో సింధు కాంస్య పతకం సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచారు. ఇచ్చిన మాట ప్రకారం సింధుకి ఐస్‌క్రీం తినిపించి మోదీ మాట నిలుపుకున్నారు.
నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించి రికార్డు సృష్టించారు. ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో వ్యక్తిగత స్వర్ణం.. అథ్లెటిక్స్‌లో 120 ఏళ్ల తర్వాత తొలి బంగారు పతకం గెలిచి.. చరిత్ర సృష్టించారు. చోప్రాకు ఇష్టమైన చుర్మా అందించి.. నీరజ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు ప్రధాని.

ఒలింపిక్ మెడల్ సాధించిన వారందరినీ తన నివాసానికి ఆహ్వానించి.. వారికి ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు ప్రధాని మోదీ. వారితో కలిసి డిన్నర్ చేసి.. ఫోటోలు దిగి.. వారందరినీ పేరు పేరునా పలకరించి.. ఆత్మీయంగా మాట్లాడి.. వారు సాధించిన విజయాలను కొనయాడారు. మున్ముందు మరింత బాగా రాణించాలని సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ.



