మోడీజీ.. జమిలి ఎన్నికలు ఉన్నాయా? లేవా?

 

ఒక దేశం ఒకే ఎన్నిక విధానం అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది.. దానిలో భాగంగానే వచ్చే లోక్‌సభతో పాటు, అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని తాపత్రయపడుతోంది.. అయితే జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ఎప్పుడో ప్రకటించింది.. కానీ బీజేపీ మాత్రం జమిలి దిశగా అడుగులు వేస్తుంది.. బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుంది.. వాటిని కాదని బీజేపీ ఏకపక్షంగా జమిలి ఎన్నికలకు వెళ్లే సాహసం చేయదు.. అందుకే లా కమిషన్ ద్వారా జమిలీ కలను సాకారం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.. లా కమిషన్ కేంద్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా.. వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతూ, సిఫార్సులు చేస్తూ వస్తోంది.. ఇప్పుడు రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంది.

లా కమిషన్ జరిపిన అభిప్రాయ సేకరణలో కొన్ని పార్టీలు మాత్రమే జమిలి ఎన్నికలకు పూర్తి స్థాయి సానుకూలత తెలిపాయి.. మెజారిటీ పార్టీలు వ్యతిరేకత తెలిపాయి.. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జమిలి ముసుగులో ముందస్తు ఎన్నికలకు సహకరించేది లేదని తేల్చి చెప్పింది.. ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస, ఒకేసారి పార్లమెంట్‌, అసెంబ్లీలకు ఎన్నికలు జరిపేందుకు తాము అనుకూలమని స్పష్టం చేసింది.. మరోవైపు తమిళనాడు డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ మాట్లాడుతూ.. తమ పార్టీ జమిలి ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నదని, ఇలాంటి ఒక ఆలోచన లా కమిషన్‌ చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.. ఇది సమాఖ్య విధానానికి విఘాతంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.. ఇక యూపీలోని సమాజ్‌వాది పార్టీ, బీహార్ లోని జేడీయూ జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపాయి.. మరో ప్రధాన పక్షమైన తృణమూల్‌ కాంగ్రెస్‌ మాత్రం చాలా బలంగా తాము జమిలి విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది.. వామపక్షాలు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.. అసలు జమిలి ఎన్నికల అంశం లా కమిషన్‌ పరిధిలోనే ఉండదని, పూర్తిగా పార్లమెంట్‌కే ఆ అధికారం ఉంటుందని తెలిపాయి.

2019 ప్రారంభంలో లో పన్నెండు రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించాలని మోడీ పట్టుదలతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. 2024కు దేశవ్యాప్తంగా ఒకే సారి జమిలి నిర్వహించాలనేది ఆయన ఆలోచన.. దాని ప్రకారమే ప్రస్తుతం, కసరత్తు నడుస్తోంది.. చివరిగా లా కమిషన్ పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంది.. మరి, కొన్ని పార్టీలకు ఇష్టంగా, కొన్ని పార్టీలకు కష్టంగా ఉన్న ఈ జమిలి ఎన్నికలను మోడీ ప్రభుత్వం కొన్ని పార్టీలను కష్టపెట్టి నిర్వహిస్తుందో లేక ఎప్పటిలానే ఎన్నికలకు వెళ్ళడానికి అంగీకరిస్తుందో చూడాలి.