టీడీపీ ఎందుకు పుట్టిందో కూడా మర్చిపోయారు

 

గుంటూరులో జరుగుతున్న సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. ఆంధ్రా తలరాతను మారుస్తామని చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు యూటర్న్‌ తీసుకుని రాజకీయాలు చేస్తున్నారని మోదీ అన్నారు. అమరావతిని నిర్మిస్తామని హామీ ఇచ్చారని.. కానీ నేడు సొంత భవిష్యత్‌ను నిర్మించుకోవడంలో తలమునకలైపోయారని మోదీ విమర్శించారు. అలాగే దేశాన్ని దుర్భరమైన స్థితిలో వదిలేసినవాళ్లంతా మహాకూటమి పేరుతో ఏకమై రాజకీయ ఆందోళనలు చేస్తున్నారని, ఏపీ అభివృద్ధిని గాలికొదిలి మోదీని తరిమికొట్టాలని చంద్రబాబు నినాదాలు ఇస్తున్నారని అన్నారు.

ఎన్టీఆర్‌ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నానని, ఆయన కలల్ని నెరవేరుస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్‌తో అంటకాగుతున్నారని, ఎన్టీఆర్‌ ఆదర్శాలను తుంగలో తొక్కారని విమర్శించారు. అసలు టీడీపీ ఎందుకు పుట్టిందో.. చారిత్రక నేపథ్యం ఏంటో కూడా చంద్రబాబు మర్చిపోయారని, అందుకే చంద్రబాబుకి వాస్తవాలు తెలిసేలా చేయాలని, ఎన్టీఆర్‌ ఎలాంటి పరిస్థితుల్లో టీడీపీని స్థాపించారో గుర్తొచ్చేలా చేయాలన్నారు.