ఐక్యత చాటిన స్పూర్తి దీపం! 130 కోట్ల ప్ర‌జ‌ల మ‌నోధైర్యాన్ని పెంచింది!

ఒకేసారి లైట్లు ఆఫ్. అంతా చీక‌టి. సెకెండ్ల వ్య‌వ‌ధిలో 130 కోట్ల మంది ప్రజల చేతిలో దీపాలు, కొవ్వ‌త్తులు, సెల్‌ఫోన్ లైట్లు. అద్భుత‌మైన వెలుగు. అదో అనుభూతి. జ్ఞానానికి కాంతి సంకేతం. ప్రజలంతా ఒకేసారి దీపాలను వెలిగించటం ద్వారా కరోనాతో ఏర్పడిన నిరాశ నుంచి ఆశ వైపుకు తీసుకెళ్లాలని ప్ర‌ధాన మంత్రి మోదీ భావించారు. దేశ ప్ర‌జ‌లు అనుస‌రించారు. ప్రపంచానికి గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఆ దీపపు వెలుగులతో అంధకారాన్ని పారద్రోలటంతో పాటు... ఒంటరిగా లేమన్న సందేశాన్ని వినిపించారు. కరోనాను తరిమి కొట్టాలన్న సంకల్పంతో కరోనాను జయించడం అసాధ్యమేమీ కాదు. ఆరోగ్య భారతదేశం నిర్మాణానికి మన వంతుగా మనం కృషి చేస్తామ‌ని దీపం వెలుగు సాక్షిగా చాటి చెప్పారు. 

కరోనా పై పోరాటం నిమిత్తం యావత్తు జాతి ఒకే తాటిపై నిల‌బ‌డింది. 130 కోట్ల మంది ప్ర‌తి ఒక్క‌రూ దీపం వెలిగించారు. కరోనావైరస్ చీకటి" తో పోరాడటానికి సంఘీభావం చూపిస్తూ  రాత్రి 9 గంటలకు దేశ‌మంతా కరెంట్ ఆఫ్ చేసి, త‌మ త‌మ ఇంటి గుమ్మం ముందు నిల‌బ‌డి 9 నిమిషాల పాటు దీపాలను, కొవ్వొత్తులను, సెల్‌ఫోన్ టార్చ్ ను ఆన్ చేశారు. ప్ర‌ధాన‌ మంత్రి మోడీ ఇచ్చిన పిలుపుకు విశేష స్పంద‌న ల‌భించింది. 

130 కోట్ల దీపాల వెలుగులో భారత్ వెలిగిపోయింది. ఆ దృశ్యం మ‌రిచిపోలేని అద్భుత‌మైన అనుభూతిని ప్ర‌జ‌ల‌కు మిగిల్చింది. ఓ వైపు క‌రోనా భ‌యం. మ‌రో వైపు వెలుగుతున్న దీపాల వెలుగుతో ప్ర‌జ‌ల్లో ధైర్యం పెరిగింది. మనం మనకోసం కాదు.. వేల మందికోసం ఇప్పుడు పోరాడుతున్నాం. మ‌న‌మంతా ఒక్క‌టే న‌ని దీపం వెలిగించి మొత్తం భార‌త‌జాతి చాటిచెప్పిన ఈ తొమ్మిది నిమిషాలు ఓ చ‌రిత్ర‌.

దీపం వెలుగు సాక్షిగా తామెవ‌రూ ఒంటరిగా లేమని ధైర్యం చెప్పుకున్నారు 130 కోట్ల ప్ర‌జ‌లు. కంటికి క‌నిపించ‌ని క‌రోనా ర‌క్ష‌సి పీడ నుంచి ప్ర‌పంచ మాన‌వాళి బ‌య‌ట‌ప‌డాల‌ని ప్ర‌జ‌లు ఈ సంద‌ర్భంగా కోరుకున్నారు.

ముందు వ‌రుస‌లో వుండి కరోనాపై యుద్ధం చేస్తున్న డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బందికి సంఘీభావంగా జనతా కర్ఫ్యూ రోజున సాయంత్రం 5గంటల సమయంలో తమ తమ ఇళ్ల బాల్కనీలోకి లేదా గుమ్మం దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టాలని మోడీ పిలుపుకు  విశేష స్పందన లభించిన‌ట్లే దేశ ప్ర‌జ‌లంతా ఒక‌టై  తొమ్మిది నిమిషాల పాటు దీపం వెలిగించి త‌మ ఐక్య‌త‌ను చాటారు.  దీపాలు వెలిగ‌డం ఎంతో మంగళకరం. దేశమంతా ఒక్కటేనన్న భావన అందరిలో కలిగించ‌డానికి ప్ర‌ధాని మోది చేసిన ప్రయత్నం విజ‌య‌వంతం అయింది.