చొరబాటు సంగతి తేల్చండి: జింన్ పింగ్‌తో మోడీ
Published on: Thu Sep 18, 2014 4:48PM

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఓ వైపు భారతదేశంలో పర్యటిస్తూనే వున్నారు. ఒప్పందాల మీద సంతకాలు చేస్తూనే వున్నారు. మరోవైపు సరిహద్దులో చైనా సైనికులు భారత్‌లోకి చొరబాట్లకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో జిన్ పింగ్ విధానం ఏమిటో తేల్చాలని నరేంద్రమోడీ పట్టుబట్టారు. ఈ విషయం మీద మోడీ జిన్ పింగ్‌తో ముప్పావుగంట సేపు చర్చించారు. మోడీ వాదనను విన్న జిన్ పింగ్ చొరబాట్ల సమస్యను పరిష్కరించడానికి తన సుముఖతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సరిహద్దుల దగ్గర జరుగుతున్న గొడవను రెండు దేశాలూ పరిష్కరించుకోవాల్సిన అవసరం వుందని, ఆ సమస్య తీరకుండా ఇరు దేశాల మధ్య ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నా అర్ధం వుండదని మోడీ ఈ సందర్భంగా అన్నట్టు సమాచారం. సరిహద్దు సమస్య పరిష్కారమైనప్పుడే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని మోడీ అనగా, చైనా-భారత్ సరిహద్దు వ్యవహారం ఇరు దేశాలకు ఇబ్బందిగానే ఉందని, సరిహద్దు స్పష్టంగా లేకపోవడం వల్లే ఈ సమస్య వస్తోందని, ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుందామని జిన్ పింగ్ అన్నట్టు తెలుస్తోంది.


