పశ్చిమబెంగాల్ ‌లో ప్రధాని ఏరియల్ సర్వే.. వెయ్యి కోట్ల ప్యాకేజీ ప్రకటన

ఆంఫన్ తుఫాన్ పశ్చిమబెంగాల్‌‌ను అతలాకుతలం చేసింది. తుఫాన్ తాకిడికి పశ్చిమబెంగాల్‌లో 80 మందికి పైగా చనిపోయారు. వేల ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. తీర ప్రాంతం వెంబడి అనేక చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. 

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ వెళ్లారు. కోల్‌కత్తా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం మమతను పలకరించిన మోడీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆంఫన్ తుఫాన్ ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని మమత డిమాండ్ చేశారు.

అనంతరం ప్రధాని మోడీ ఏరియల్ సర్వే జరిపారు. మమతా బెనర్జీ కూడా ప్రధానితో ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. మోడీ మ్యాప్ చూస్తూ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నష్టంపై ప్రాథమికంగా అంచనా వేశారు. 

ఏరియల్ సర్వే జరిపాక, పశ్చిమబెంగాల్‌కు ప్రధాని మోడీ వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. తుఫాన్ కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్న మోడీ.. కష్టకాలంలో బెంగాల్ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. తాత్కాలిక సాయం కింద వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రధాని.. నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిశాక మరింత సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారం కూడా ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేల రూపాయల సాయం ప్రకటించారు. రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు.