ఎంపీలకు మోడీ వార్నింగ్...
Published on: Tue Mar 21, 2017 3:46PM

తమ పార్టీ ఎంపీలపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీకి అంతలా కోపం తెప్పించే పని ఏం చేశారబ్బా అనుకుంటున్నారా..? అదేంటంటే.. పార్లమెంట్ సమావేశాలకు రాకుండా ఉండటమే. సభ ప్రారంభమైనా కానీ ఎంపీలు సరిగా రాకపోవడంతో పార్లమెంట్ కార్యకలాపాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో దీనిపై స్పందించిన మోడీ... ఎంపీలంతా పార్లమెంటుకు రావడం కనీస బాధ్యతని, అందరు సభ్యులూ విధిగా రావాలని, తాను ఎవరిని ఏ సమయంలోనైనా పిలుస్తానని, రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్లమెంటుకు వస్తే ఎన్నో మంచి పనులు చేయవచ్చని, సభకే రాకుంటే అభివృద్ధి కుంటుపడుతుందని హితవు పలికారు. అంతేకాదు నిన్న కూడా సభ్యుల సంఖ్య సరిపోక సభ ఆలస్యం అయిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లగా, ఎవరెవరు వచ్చారన్న విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. రానివారి జాబితాను తీసుకున్నారు.


