మోడీకి పాకిస్థాన్ బాలిక లేఖ... బుల్లెట్లు కాదు బుక్స్ కొనండి...
Published on: Wed Mar 15, 2017 11:33AM

యూపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనుకున్నదానికంటే ఎక్కువ స్థానాలు గెలిచినందుకు గాను పార్టీ నేతలు ఫుల్ కుషీగా ఉన్నారు. పార్టీ నేతలతో పాటు ప్రధాని మోడీ కూడా మంచి ఆనందంలో ఉన్నారు. అయితే ఈ గెలుపుపై ఓ బాలిక మోడీకి లేఖ రాసింది. ఆ లేఖ రాసింది మన దేశానికి చెందిన బాలిక అనుకుంటున్నారా.. కాదు.. పాకిస్థాన్ కు చెందిన బాలిక. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఆ బాలిక ఏంటీ..?లెటర్ ఏంటీ ?అని తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
పాకిస్థాన్ కు చెందిన 11 ఏళ్ల బాలిక అకీదత్ నవీద్ ప్రధాని మోడీకి లేఖ రాస్తూ పలు ఆసక్తికర అంశాలు పేర్కోంది. ఆ లేఖలో భవిష్యత్తులో మరిన్ని ఎన్నికల్లో గెలవాలంటే ముందు రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేలా చూడాలని కోరింది. అంతేకాదు.. సంబంధాలు మెరుగుపరుచుకోవడం వల్ల రెండు దేశాలకూ లబ్ధి చేకూరుతుందని... రెండు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించండి.. తుపాకీలు కొనుగోలు చేసేకంటే.. రెండు దేశాల్లోని లక్షల మందికి ఉచితంగా మందులు పంపిణీ చేయండి..ఇండియా, పాకిస్థాన్ బుల్లెట్లు కొనే కంటే.. బుక్స్ కొనాలంటూ లేఖలో తెలిపింది. కాగా గతంలోనూ శాంతి కోరుతూ ప్రపంచ దేశాధినేతలకు అకీదత్ లేఖలు రాసింది. మోడీకి కూడా గతంలో ఈ బాలిక లేఖ రాసింది. దానికి గాను మోడీ కూడా ప్రతిగా గ్రీటింగ్ కార్డు పంపారు. మరి ఈసారి ఆయన ఎలాంటి సమాధానం పంపుతారో చూడాలి.



