ఇండియాకు 130వ ర్యాంకుపై మోడీ అసంతృప్తి...


భారత్ పరిశ్రమలు పెట్టుకోవడానికి గాను.. వ్యాపారం చేసుకోవడానికి గాను అనువైన దేశాల్లో ఒకటిగా చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ర్యాంకు పై ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. సులువుగా వ్యాపారం చేసుకోదగ్గ దేశాల జాబితాను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. మొత్తం 190 దేశాలకు ర్యాంకులివ్వగా.. అందులో ఇండియా 130వ స్థానంలో నిలిచింది. దీంతో భారత ర్యాంకు కలవరపరిచే స్థాయిలో ఉండటంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా కీర్తించబడే భారత్ కు ఇంత తక్కువ స్థాయి ర్యాంకు రావడానికి గల కారణాలను అన్వేషించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇండియాలో మారుమూల ప్రాంతాల్లో విద్యుదీకరణ జరగడం, ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే వేగవంతమైన అనుమతులు, సులభ రుణాలు, పన్ను రాయితీలు వంటివి అందుబాటులో ఉన్నా, ర్యాంకు ఘోరంగా ఉండటంపై ఓ నెలలోపు నివేదిక ఇవ్వాలని క్యాబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హాను మోదీ ఆదేశించినట్టు తెలుస్తోంది.