TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రధాని మోదీకి సౌదీ అరేబియాలో అపూర్వ స్వాగతం

Published on: Tue Apr 22, 2025 6:52PM

 

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సౌదీ అరేబియా ప్రభుత్వం అపూర్వ రీతిలో స్వాగతం పలికింది. ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించగానే, రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాలు దానిని అనుసరిస్తూ ప్రత్యేక గౌరవం అందించాయి. ప్రధాని విమానానికి ఇరువైపులా ఎస్కార్ట్‌గా వచ్చిన ఎఫ్‌-15 ఫైటర్ జెట్‌లు ఆయనకు స్వాగతం పలికినట్లు విదేశాంగ శాఖ విడుదల చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి గౌరవం చాలా అరుదుగా లభిస్తుంది. ఈ ప్రత్యేక స్వాగతం ఇరు దేశాల మధ్య, ముఖ్యంగా రక్షణ రంగంలో బలపడుతున్న సంబంధాలకు నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని  సౌదీ అరేబియా చేరుకున్నారు. 

ఈ పర్యటనలో ప్రధానంగా ఇంధనం, వాణిజ్యం, రక్షణ వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు. ఇటీవల మోదీ, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ల మధ్య జరిగిన చర్చల అనంతరం పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ నేపథ్యంలో తాజా పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్, సౌదీ అరేబియాల మధ్య ఇప్పటికే బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ఈ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఇరు దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. . దీనిపై ప్రధాని ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఈ పర్యటన రెండు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఈ రోజు, రేపు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నాను’’ అని చెప్పారు. మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇది మూడోసారి