మోడీని ‘గాడు‘ అనడం కరెక్టేనా?

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ వుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఆయన ఎంత కష్టపడ్డారో... ఇప్పుడు బంగారు తెలంగాణని సాధించడానికి అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నారు. ఆయన శ్రమ ఫలించి త్వరలోనే బంగారు తెలంగాణ సిద్ధించాలని, కష్టాలు, కన్నీళ్ళు, పేదరికం లేని బంగారు తెలంగాణ దేశం మొత్తానికీ ఆదర్శం కావాలని, దేశంలోని రాష్ట్రాలన్నీ తెలంగాణ రాష్ట్రాన్ని చూసి కుళ్ళుకోవాలని కోరుకుందాం. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలి. రాష్ట్రానికి చెందిన అవసరాలను నెరవేర్చుకోవడానికి, హక్కులను సాధించుకోవడానికి కేంద్రంతో పోరాటం చేయాలి. ప్రస్తుతం కేసీఆర్ చేస్తున్న పని కూడా ఇదే. ఈ విషయంలో ఆయన్ని అభినందించి తీరాలి. నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రస్తుతం ముఖం చూసి బొట్టు పెట్టే తరహాలో వ్యవహరిస్తోందన్న విమర్శలు వివిధ రాష్ట్రాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ అధికారంలో వున్న రాష్ట్రాలకు, త్వరలో ఎన్నికలు రాబోతున్న రాష్ట్రాలకు మాత్రమే అధిక నిధులు కేటాయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మిగతా రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపిస్తున్నారన్న ఆక్రోశం వినిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల విషయంలో మోడీ మరింత మొండిగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కేంద్రం మీద పోరాటం ప్రారంభించేశారు. నిన్న మొన్నటి వరకూ మోడీని అభిమానిస్తూ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పుడు మోడీ మీద వ్యతిరేకతని బాహాటంగా ప్రదర్శిస్తున్నారు. అయితే ఆ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న భాష మాత్రం అభ్యంతరకరంగా వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మోడీని విమర్శించిన కేసీఆర్ ఒక్కసారిగా ‘‘మోడీ గాడు’’ అనే పదాన్ని ఉపయోగించారు. ఆ మాట విన్న అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని సంబోధించాల్సిన తీరు ఎంతమాత్రం కాదు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాక కూడా ఉద్యమ వేడి చల్లారని స్థితిలో కేసీఆర్ అనేకసార్లు మోడీని ‘‘సన్నాసి’’ లాంటి మాటలతో విమర్శించారు. అయితే నిన్న మొన్నటి వరకు మోడీని ప్రశంసల జల్లులో ముంచెత్తిన కేసీఆర్ ఇప్పుడు ఏకంగా ఆయన్ని ‘‘మోడీ గాడు’’ అనడం రాజకీయ వర్గాలలో ప్రకపనలు రేపింది.

 

కేసీఆర్ ఒకవేళ ‘‘మోడీ గారు’’ అనబోయి పొరపాటున ‘‘మోడీ గాడు’’ అన్నారా అనే సందేహం కొంతమందిలో ఏర్పడింది. అయితే ఈ విషయంలో హర్టయిన బీజేపీ వర్గాలు కేసీఆర్ మీద కారాలూ మిరియాలు నూరుతున్నాయి. అప్పుడయినా ‘నేను పొరపాటుగా అన్నాను’ అనే మాట కేసీఆర్ వైపు నుంచి రాలేదు. అంటే కేసీఆర్ ఆ మాటను ఉద్దేశపూర్వకంగానే అన్నారని భావించాల్సి వస్తోంది. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తినే ‘సన్నాసి’ అని సంబోధించిన వ్యక్తి ఇప్పుడు ‘గాడు’ అని అనడానికి పెద్దగా జంకాల్సిన అవసరం లేదు. అయితే ఈ తరహా కామెంట్లు భవిష్యత్ తరాలకు ఎలాంటి సందేశం ఇస్తుందనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం వుంది. ప్రస్తుతం కేంద్రంలో మోడీ హవా నడుస్తోంది. ఏపీలో అణిగి మణిగి వున్న మిత్రపక్షం వినతులే ఆయన పట్టించుకోవడం లేదు.. అలాంటిది కేసీఆర్ ఇలాంటి కామెంట్లు చేస్తూ వుంటే దాని పర్యవసానం ఎలా వుంటుందోనన్న ఆందోళనలు సగటు తెలంగాణ పౌరులలో వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ ప్రధానిని అలాంటి ఘాటు మాటలతో విమర్శించడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జరుగుతున్న డ్యామేజ్‌ని కేసీఆర్ గ్రహించాలని పలువురు కోరుకుంటున్నారు.