TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అనంత‌లో ప్ర‌మాదం.. ప్ర‌ధాని మోదీ 2ల‌క్ష‌ల ప‌రిహారం..

Published on: Mon Feb 7, 2022 11:23AM

అనంతపురం జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. యాక్సిడెంట్‌లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.  

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి ద‌గ్గ‌ర‌ ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర‌ విషాదాన్ని నింపింది. బంధువుల పెళ్లి వేడుకకు హాజరై కారులో ఇంటికి తిరిగి వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందారు. మృతుల్లో పెళ్లి కుమార్తె తండ్రి, ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరిలో తల్లి, ఇద్దరు పిల్లలు, ఇద్దరు అక్కాచెల్లెల్లు ఉన్నారు. 

ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామానికి చెందిన బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోకా వెంకటప్ప (55) కూతురు ప్రశాంతి వివాహం ఆదివారం బళ్లారిలో జరిగింది. వివాహానంతరం పెళ్లి కుమార్తె వద్ద భార్య, కొందరు బంధువులను ఉంచి.. వెంకటప్ప స్వగ్రామం బయలుదేరారు. ఇన్నోవా కారులో ఆయన వెంట మరికొందరు బంధువులు వస్తున్నారు. ఉరవకొండ సమీపంలో బూదగవి గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న లారీ, కారు ఢీకొన్నాయి. నుజ్జునుజ్జయిన కారుపైకి లారీ దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి రైతులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ప్రమాద స్థలంలో అక్కడికక్కడే ఎనిమిది మంది మరణించారు. మృతుల్లో స్వాతి(30), ఆమె కూతురు జాష్ణవి(13), కుమారు జస్వంత్‌(13), సుభద్రమ్మ(60), ఆమె సోదరి శివమ్మ(58), అశోక్‌, సరస్వతి, రాధమ్మ ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వెంకటప్పను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రమాదానికి వెంకటప్ప అలసటగా ఉండటమే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తాజాగా, రోడ్డు ప్ర‌మాదంపై ప్ర‌ధాని మోదీ సైతం దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసి.. 2 ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టించారు.